`మా` ఎన్నికల ముందు.. అనుక్షణం మీడియా ముందున్న మంచు విష్ణు, అధ్యక్షుడు అయ్యాక మాత్రం మరీ నల్లపూసైపోయారు. టికెట్ రేట్ల విషయంలో టాలీవుడ్ లో గోల గోల జరుగుతున్నా పట్టించుకోలేదు. ఏపీ మంత్రులు కొంతమంది సినీ తారల్ని నోటుకొచ్చినట్టు తిట్టినా – స్పందించలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన మీడియాకు చిక్కారు. ఈ సందర్భంగా టికెట్ రేట్ల ప్రస్తావన దగ్గర్నుంచి, మా బిల్డింగ్ వరకూ అనేక ప్రశ్నలు సంధించారు మీడియా వాళ్లు. వాటన్నింటికీ కర్ర విరక్కుండా, పాము చావకుండా సమాధానాలు చెప్పి తప్పించుకున్నారు.
టికెట్ రేట్ల వ్యవహారం ప్రస్తావిస్తే….
– తెలంగాణలో టికెట్ రేట్లు పెంచారు. ఆంధ్రాలో తగ్గించారు.. రెండు చోట్లా నిర్మాతలు కోర్టు కెళ్లారు. మరి అది తప్పా? ఇది తప్పా? టికెట్ రేట్ల గురించి నేను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేనేం మాట్లాడినా… `మా` తరపున మాట్లాడినట్టు ఉంటుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ వ్యక్తిగత అభిప్రాయం అడగలేదు. దీని గురించి మాట్లాడడానికి ఛాంబర్ ఉంది.. వాళ్లు చూసుకుంటారు.. – ఇదీ… మంచు విష్ణు సమాధానం.
మా బిల్డింగ్ ఎప్పుడు? అని అడిగితే..
`మా` అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తయిన తరవాత.. ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలన్నీ చెబుదామనుకున్నాం. కుదర్లేదు.. త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెబుతాం.
చిరంజీవి ఇండ్రస్ట్రీ వాళ్లతో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.. అని అడిగితే…
మా జనరేషన్‌కి మా నాన్నగారితో పాటు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ… వీళ్లంతా సీనియర్లు. పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా, అందరూ కలిసి ఓ ఉమ్మడి నిర్ణయం తీసుకుంటారు.
అంటూ కప్పదాటు సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్లారు విష్ణు. జీవోల గురించి అడిగినప్పుడు మాత్రం `అప్పట్లో దాసరి అంకుల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని కలిసి.. ఓ జీవోని తీసుకొస్తే… ఆయన తరవాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కేవలం నలుగురి కోసం పాత జీవోని రద్దు చేసి, కొత్త జీవో తీసుకొచ్చారు. ముందు వాటి గురించి మాట్లాడండి..` అంటూ కాస్త కాంట్రవర్సీ లేవదీసే ప్రయత్నం చేశాడు. వై.ఎస్.ఆర్ తీసుకొచ్చిన జీవోలో ఏముంది? కిరణ్ కుమార్ రెడ్డి జీవో ఏమిటి? అని అడిగితే మాత్రం.. `అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీది.. నాది కాదు` అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
సో.. విష్ణు బాబు మాట్లాడాలంటే ముందు ఆ రెండు జీవోల గురించి చర్చ జరగాలన్నమాట. ఆ తరవాతే.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవో గురించి ఆయన నోరు విప్పుతారు. ఇదేం లాజిక్కో. ఇప్పుడు విష్ణు వ్యక్తిగత అభిప్రాయం చెప్పినట్టా? `మా` ప్రెసిడెంటుగా మాట్లాడినట్టా?