ప్రశ్నించడానికోసమే వస్తున్నా.. అన్నాడు పవన్ కల్యాణ్. ఆయనేమాత్రం ప్రశ్నించాడో, సమాధానాలు రాబట్టాడో తెలీదు గానీ, ఇప్పుడు మంచు మనోజ్ కూడా ‘ఐ యామ్ ఆల్ సో..’ అంటూ రాబోతున్నార్ట. ”త్వరలోనే ప్రజల ముందుకు వస్తా.. ప్రశ్నిస్తా… సమాధానాలు కక్కిస్తా” అంటూ ఆవేశంగా మాట్లాడాడు మంచు మనోజ్. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా చేసిన ప్రభావమో ఏమో తెలీదు గానీ.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మంచు మనోజ్ ఆవేశంగా రెచ్చిపోయాడు. సమాజంలో అసమానతల గురించి అనర్గళంగా మాట్లాడాడు. మానవత్వం గురించి స్పీచులు దంచి కొట్టాడు. సమాజంలో బలవంతుడు బలహీనుణ్ని దోచుకోవడం కామన్ అయిపోయిందని, అది తట్టుకోలేకే కొన్ని రోజుల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజా జీవితంలోకి వద్దామనుకొన్నానని గుర్తు చేసుకొన్నాడు మనోజ్. ఆ సమయంలో అన్నయ్య విష్ణు తనని వారించాడట. అందుకే… తన ట్వీట్‌ని, ఆ ఆలోచనని మళ్లీ వెనక్కి తీసుకొన్నాడట. ”కానీ ఏదో ఓ రోజు తప్పకుండా ప్రజల ముందుకొస్తా. అప్పుడు ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తా. ఎవ్వరినీ వదలను. అందరి పేర్లూ నోట్ చేసుకొన్నా. సమాధానాలు కక్కిస్తా” అంటూ ఆవేశంగా మాట్లాడాడు. సో… మనోజ్ స్పీచ్ నుంచి తెలిసొచ్చిన విషయం ఏమిటంటే.. మనోజ్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడన్నమాట. మరి అదెప్పుడో, ప్రశ్నలు సంధించేది ఎప్పుడో, సమాధానాలు రాబట్టేది మరెప్పుడో. ప్రస్తుతానికి ఈనెల 10న ‘ఒక్కడు మిగిలాడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.