హోంమంత్రి వంగలపూడి అనితపై పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో.. ఏ అంశం విషయంలో కామెంట్లు చేశారో కానీ అది మెల్లగా కులం కోణం తీసుకుంటోంది. వంగలపూడి అనిత దళిత వర్గానికి చెందిన మహిళ కావడంతో అందునా మాదిగవర్గ నేత కావడంతో ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెరపైకి వచ్చారు. పవన్ పై వరుసగా విమర్శలు చేశారు. ఓ కేబినెట్ మంత్రిగా.. మరో కేబినెట్ మంత్రికి .. శాఖకు సంబంధించిన అంశాలను బహిరంగంగా చర్చించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మాదిగ వర్గానికి చెందిన వంగలపూడి అనితను ఇలా అవమానించడాన్ని మాదిగలు మనసులో పెట్టుకుంటారని హెచ్చరించారు.
ఈ అంశంతోనే మందకృష్ణ వదిలిపెట్టలేదు. ఎన్నికల సమయంలో ఒక్క మాదిగ వర్గ నేతకు టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని.. అలాగే మంత్రి వర్గంలో మూడు మినిస్టీరియల్ పోస్టులు వచ్చిన దళిత,బీసీ,ఎస్టీ వర్గాలకు ఇచ్చేందుకు ప్రయత్నించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. పొత్తుల్లో భాగంగా మూడు రిజర్వుడు నియోజకవర్గాలు దక్కితే మూడు ఒకే వర్గానికి ఇచ్చారన్నారు. తూ.గో జిల్లాలో రెండుసీట్లను ఒకే వర్గానికి ఇస్తే కనీసం రైల్వే కోడూరులో అయినా మాదిగ వర్గానికి ఇవ్వాల్సి ఉందన్నారు. అక్కడ మాదిగలు గెలిచిన చరిత్ర మంత్రులు అయిన చరిత్ర కూడా ఉందన్నారు. సామాజిక న్యాయం అనే పవన్ ఈ విషయంలో ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.
మంత్రి పదవులు కూడా ఒకటి, రెండు కులాలకే ఇచ్చారని రెండు పదవులు ఇచ్చినా కనీసం మూడో పదవి అయినా ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల గురించి ఆలోచించాలి కదా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. మాదిగలకు ఎక్కడ ఏం జరిగినా తానున్నానంటూ మందకృష్ణ వస్తారు. అయితే పవన్ అనితపై చేసిన వ్యాఖ్యల వెనుక కులం కోణం లేదు. కానీ ఆయన మాత్రం వచ్చేశారు.