మాజీ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు మళ్లీ టీడీపీలోకి రావాలని నిర్ణయించుకున్నట్లుగా నిజామాబాద్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవిత పరిస్థితి క్లిష్టంగా ఉందని ఆలోచించిన కేసీఆర్ ఆయన ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. ఆయన సీనియార్టీకి గౌరవం కూడా ఇవ్వలేదు. దీంతో ఆయన ఎప్పుడూ బీఆర్ఎస్ రాజకీయాల్లో కనిపించలేదు.
తెలంగాణలో పార్టీకి మళ్ళీ జీవాలు పోయాలన్న సంకల్పంతో టిడిపి అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతంలో టిడిపికి పట్టున్న జిల్లాలపై …. అలాగే సెట్లర్స్ ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలపై మరింత దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావును రాష్ట్ర టీటీడీపీలో యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మండవ నిజామాబాద్ రూరల్ నాటి డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు.
ఈ సమయంలో తెలంగాణలో టిడిపికి మండవ లాంటి సీనియర్లు అవసరం అని భావించిన చంద్ర బాబు మళ్ళీ టీటీడీపీలో మండవకు కీరోల్ పోషించే బాధ్యతలు అప్పజెప్పానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో టీడీపీ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమయంలోనే మండవ తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని అంటున్నాయి టిడిపి వర్గాలు. జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకు కూడా ఉంది. మండవ లాంటి నేత వస్తే మళ్లీ వారంతా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.