మాజీ మంత్రి, బీఆరెస్ నేత మండవ వెంకటేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలోనే పార్టీ మారడం జరిగిందన్నారు. పార్టీ మారడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదనితెలంగాణలో మార్పు కోసం ప్రతి ఓటర్ భాగస్వామ్య కావాలని మండవ వెంకటేశ్వరరావు కోరారు. తొలి విడత తెలంగాణ ఉద్యమంలో 360 మంది, రెండో విడతలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.
ఆత్మబలిదానాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అందరూ కేసీఆర్‌ను నిందిస్తున్నారని తెలిపారు. ప్రశ్నించే వ్యక్తిని అణిచివేసే వ్యక్తిగా కేసీఆర్ నిలిచారన్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందన్నారు. ఉద్యోగస్తులకు 15వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లా అయిందన్నారు. ధరణి నష్టదాయకంగా తయారైందన్నారు. గతంలో రైతుబందు రూ.12000లకే సీఎం కేసీఆర్ భారమన్నారని, మరి ఇప్పుడు రూ.16,000 ఎక్కడి నుంచి తెచ్చేస్తారని ప్రశ్నించారు.
మండవ వెంకటేశ్వరరావు టిక్కెట్ల కేటాయింపు సమయంలోనే కాంగ్రెస్ లో చేరుతారని అనుకున్నరు. ఆయనకు కూకట్ పల్లి లేదా నిజామాబాద్ రూరల్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరిక ఆలస్యమయింది. ఇప్పుడు ఎలాంటి టిక్కెట్ కేటాయించే అవకాశం లేకపోయినా ఆయన పార్టీ మారడం రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది.
మండవ వెంకటేశ్వరరావు టీడీపీ సీనియర్ నేత. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత పరిస్థితి క్లిష్టంగా మారడంతో మండవ ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపి కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ గత ఐదేళ్లలో ఆయనను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు.