ఎస్సీల వర్గీకరణ విషయంలో ఆయన సమాజానికి ముఖ్యంగా ఆ కులం వారికి ఎంత మేరకు ఉపయోగపడతారో గానీ.. కొందరు వక్రమార్కులు మాత్రం ఆయన పేరును తమ స్వార్థానికి వాడేసుకుంటున్నారు. ఎస్సీల్లో మాదిగ వర్గం అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా పనిచేస్తూ ఉండే మందకృష్ణ పేరును అడ్డం పెట్టుకుని… ఇచ్చమొచ్చినట్లుగా డబ్బు దోచేయడానికి ఎవరికి వారు మార్గాలు వెతుక్కుంటున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి వ్యవహారం ఒకటి వెలుగుచూసింది.
నల్గొండ జిల్లా ఆలేరులో తెరాస ఎమ్మెల్యేగా గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఆమెకు కొన్ని రోజుల కిందట మందకృష్ణ దగ్గరినుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక పేద యువతి పెళ్లికోసం ఆర్థిక సాయం చేయాలనేది ఫోనుకాల్ సారాంశం. ఆ పేద యువతీయువకుల్ని తన వద్దకు పంపితే.. తానే దగ్గరుండి పెళ్లి చేయిస్తానంటూ ఆ మహిళా ఎమ్మెల్యే పాపం.. చాలా పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు. కానీ.. అవతలి వైపు మందకృష్ణ మాత్రం.. వినిపించుకోలేదు. డబ్బు తనకు ఇచ్చేస్తే చాలు తాను చేయిస్తా నంటూ పట్టుపట్టాడు. దీంతో సునీతకు అనుమానం వచ్చి అసలు మందకృష్ణ నెంబరేమిటో సేకరించి ఫోనుచేసి వివరాలు ఆరా తీసింది.
ఆమెనుంచి ఇలాంటి ఎంక్వయిరీ రావడంతో మదకృష్ణ షాక్ అయ్యారు. అసలు తానేమీ ఫోను చేయలేదని, ఆమెకు వచ్చినది ఫేక్ ఫోన్‌కాల్ అని చెప్పారు. ఆ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా కూడా మందకృష్ణ ఆమెకు సూచించారు. మందకృష్ణ పేరును అడ్డంగా వాడుకున్న ఆ దుండగుడు ఎవరో గానీ.. ఏకంగా ఎమ్మెల్యేకు 15 సార్లు ఫోను చేయడం విశేషం. ఇదంతా చూస్తే.. మందకృష్ణను జనం ఇలా కూడా వాడేసుకుంటున్నారా అనిపించకమానదు.