తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎవరైనా మరిచిపోతే బీఆర్ఎస్ తెగ ఎంజాయ్ చేస్తోంది. నేతలు, సినీ ప్రముఖులు, సాధారణ జనం ఇలా ఎవరైనా సరే… రేవంత్ పేరును మరిచిపోతే చాలు అదే పనిగా ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తూ స్వయం సంతృప్తి పొందుతోంది. ఇలాంటి వీడియోల ద్వారా రేవంత్ ఇమేజ్ ను దెబ్బతీయచ్చుననే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు ఉంది.
సాధారణంగా రాష్ట్ర సీఎం పేరు అందరికీ గుర్తుంటుంది. అతికొద్ది మందికి గుర్తుండకపోవచ్చు. కానీ, కొంతమంది లీడర్లు పొరపాటున సీఎంగా మరో నేత పేరును ఉచ్చారించినా అదేదో తెలంగాణకు అతి పెద్ద సమస్య అయినట్లుగా వార్తను ప్రసారం చేస్తోంది బీఆర్ఎస్ అనుకూల మీడియా , సోషల్ మీడియా. తాజాగా ఎమ్మెల్యే మందుల సామెలు సీఎంగా మరో నేత పేరును ఉచ్చరించారు. అయినా సీఎం పదవి వరించాలంటే అందరికీ సీఎం పేరు గుర్తుండాలనే నిబంధన ఉన్నట్టు ప్రెజెంట్ చేస్తున్నారు.
రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం. అందుకోసమే ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది బీఆర్ఎస్. అయితే, హామీల అమలులో నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా..సీఎం పేరును మరిచిపోవడమే అతిపెద్ద సమస్య అయినట్లుగా చిత్రీకరిస్తోంది. ట్రోలింగ్ కంటెంట్ తో ఎక్కువ హైలెట్ అవుతున్నారు. ఈ ట్రోలింగ్ ద్వారా ప్రత్యర్థిని సోషల్ మీడియాలో వీక్ చేయవచ్చు కానీ, జనసమూహంలో అది అసాధ్యం.
పైగా.. ఇలాంటి వాటిని తటస్థులు, మేధావులు ఎవరూ హర్షించరు. అందుకే ఇటీవల బీఆర్ఎస్ సోషల్ మీడియా సిబ్బందిని అరెస్ట్ చేసినా పెద్దగా ఖండన రాలేదు. ఇప్పటికైనా ఈ రాంగ్ ట్రాక్ ను ఫాలో అవ్వడం మానేస్తే తప్ప బీఆర్ఎస్ కు మునుపటి ఆదరణ రాదు.. ఈ విషయం ఎప్పుడు గుర్తిస్తారో చూడాలి.