మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం ఉదయం… పూర్తిగా తెల్లవారక ముందే.. వైసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టారు. చాలా ఆవేశంగా పవన్ కల్యాణ్‌ను తిట్టారు. చంద్రబాబును విమర్శించారు. ఆయన ఆవేశానికి కారణం… తన భార్య పేరు మీద అమరావతిలో ఐదు ఎకరాలు కొనుగోలు చేశారని టీడీపీ ఆరోపించడమే. తనకు ఐదు ఎకరాలు ఉన్నట్లుగా నిరూపిస్తే.. తాను రాజీనామా చేస్తానని కూడా.. సవాల్ చేశారు. బట్టీ పట్టి వచ్చి చెప్పినట్లుగా.. చెప్పేసి… వెళ్లిపోయిన ఆర్కే… గొప్పగా చెప్పాననుకున్నారు కానీ.. ఆయన అఫిడవిట్ల ప్రకారమే.. ఆయనకు 80ఎకరాలకుపైగా భూమి ఉన్నట్లుగా తేలిందంటున్నారు ఇతర పార్టీల నేతలు.
ఆర్కే ఫ్యామిలీకి అమరావతిలో పెద్ద ఎత్తున భూములు..!?
2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. రూ. ఆరు కోట్ల 83 లక్షల ఖరీదైన వ్యవసాయ భూములు ఉన్నాయని… ఆర్కే ఎన్నికల సంఘానికి అఫడవిట్ సమర్పించారు. సహజంగా ఎవరైనా.. తనకు ఎక్కడెక్కడ భూములున్నాయో వివరిస్తూ.. వివరంగా అఫిడవిట్ ఇస్తారు. కానీ ఆర్కే మాత్రం.. ఆ పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో.. చెప్పకుండా వాటి విలువ మాత్రమే ఇచ్చారు. నిజానికి అమరావతిలో రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం.. ఎకరం.. పది లక్షల లోపుగానే ఉంది. 2014లో ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2019లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం చూస్తే.. పెద్ద మొత్తంలో వ్యవసాయభూములు పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చని.. నిపుణులు చెబుతున్నారు. ఇందులో అమరావతిలోనే ఆయన భార్య పేరుతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన భూములు ఉన్నాయంటున్నారు.
నిరూపిస్తే ఇచ్చేస్తానని సవాల్ చేయవచ్చుగా..! రాజీనామా ఎందుకు..?
నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు కానీ.. తనకు భూములు లేవని చెప్పడం లేదు. పైగా.. తన పార్టీనే అధికారంలో ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ .. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేతలందరూ.. తమకు భూములు ఉంటే ఉన్నాయని.. చెప్పారు. అవి ఎప్పుడు కొన్నామో కూడా చెప్పారు. భూములు లేకపోతే.. లేవని..న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరి ప్రభుత్వంలో ఉన్న ఆర్కే అంత ధీమాగా ఎందుకు స్పందించలేదో.. ఎవరికీ అర్థం కావడం లేదు. తనకు భూములు లేవని.. ఆర్కే చెప్పడం లేదు… నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ బింకం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం వారి పార్టీ చేతుల్లో ఉంది కాబట్టి.. ఎవరూ బయటకు చెప్పరని ఆయన ధీమా కావొచ్చంటున్నారు.
సంపాదన లేని ఆర్కే.. కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలు..! ఎలా..?
ఆర్కేకు ప్రత్యేకంగా వ్యాపారాలు లేవు. 2004కి ముందు ఆస్తులు కూడా లేవు. ఆ తర్వాత ఆయన సంపాదన కూడా.. అంత పెద్ద మొత్తంలో ఏమీ లేదు. కానీ.. 2004లో వైఎస్ మొదటి సారి సీఎం అయిన తర్వాత ఆళ్ల ఫ్యామిలీ రాత మారిపోయింది. 2014లో ప్రకటించిన అఫిడవిట్ ప్రకారం… అమరావతికి సమీపంలో ఉన్న ఫిరంగిపురం మండలంలో ఆయనకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. హైదరాబాద్, గుంటూరు, పెదకాకాని, మంగళగిరి, ఫిరంగిపురంలో ఇళ్లు ఉన్నాయి. ఆయన పుట్టిపెరిగింది పెదకాకాని గ్రామంలో. ఇవన్నీ…ఎలా సంపాదించారో.. ఏం వ్యాపారం చేశారో.. మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
ఆస్తి పన్నులు కట్టరు…కానీ ఆఫిడవిట్లో మాత్రం అబద్దాలు..!
ఆర్కే వ్యవహారం మొదటి నుంచి అడ్డగోలుగానే ఉంటుందని.. పెదకాకానిలో ప్రచారం జరుగుతూ ఉంటుంది. గత ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన అక్రమంగా సంపాదించిన సొమ్ము అంతా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య పేరు మీద బినామీగా పెట్టారని తేలింది. దీనిపై విచారణ చేసినందుకే.. ఆళ్ల .. డీజీపీపై కోర్టులో పిటిషన్లు వేశారు. ఇప్పుడు వారి ప్రభుత్వమే వచ్చింది కాబట్టి.. ఆ అవినీతి అధికారి.. ఆ బినామీ ఆస్తులన్నీ సేఫ్‌గా ఉండొచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తన ఆస్తులకు కట్టాల్సిన పన్నులు కూడా కట్టరు. కానీ.. అఫిడవిట్లో మాత్రం ఏ బాకీ లేదని చెబుతూంటారు. గుంటూరు వెంకటరమణకాలనీలో ఆయన తన భార్య పేరు మీద 2013లో ఒక ఇల్లు కొన్నారు. దానికి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి టాక్స్ కట్టలేదు. కానీ తాను ప్రభుత్వ వ్యవస్థలకు బాకీలేమీ లేవని.. అఫిడవిట్లో ఇచ్చేశారు.
భూమి లేకపోతే ఆ ఫోటో షూట్లు ఎక్కడ చేస్తున్నారు..?
కొసమెరుపేమిటంటే.. తనకు ఎలాంటి భూములు లేవన్నట్లుగా చెప్పుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఫోటో షూట్లకు ప్రసిద్ధి. ఆయన పొలంలో.. రైతుగా పంచెలు కట్టుకుని.. పొలం దున్నతున్నట్లు.. ఆవులకు గడ్డిపెడుతున్నట్లు… చెట్టు కింద కూర్చుని.. కూలీలతో కలిసి అన్నం తింటున్నట్లు ఫోటో షూట్లు పెట్టుకుంటారు. .. తాను గొప్ప రైతునని .. కార్యకర్తలతో పొగిడించుకుంటూ ఉంటారు. తాను ఫోటోలు దిగే భూములు అమరావతిలోని కాదేమో..?