Mangalavaaram Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఈ మధ్య కాలంలో సినిమాపై కావల్సినంత బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్… మంగళవారం. ఆర్ఎక్స్ 100 తో విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కలసి చేసిన సినిమా కావడం, ప్రచార చిత్రాలన్నీ హైప్ ని పెంచడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది. మరీ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? మంగళవారం లోని మలుపులు ప్రేక్షకులని అలరించాయా ?
అది 90వ దశకంలోని మాహాలక్ష్మీపురం అనే ఊరు. ఆ ఊర్లో రెండు జంట హత్యలు కలకలం రేపుతాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆడ, మగ పేర్లు గోడలపై రాస్తారు. మంగళవారం రోజున ఆ జంట అనుమానస్పదంగా చనిపోతుంది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ మీనా (నందితా శ్వేత) ఆ జంటది హత్యని అనుమానపడుతుంది. పోస్ట్ మార్టంకు బాడీలని తరలించడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు ఊరి జమీందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ). ఇది పరువు ఆత్మహత్యని, పోలీసుల జోక్యం అవసరం లేదని చెబుతాడు. మళ్ళీ అదే తరహాలో మరో జంట పేరు గోడపై రాయడం.. ఆ జంట మంగళవారం రోజున చనిపోవడంతో మరోసారి ఊర్లో కలకలం రేగుతుంది. దీంతో ఊరి వాళ్లకు భయం పట్టుకుంటుంది. అసలు ఈ పేర్లు ఎవరు రాస్తున్నారు ? ఎవరు చంపుతున్నారో తెలీక ఊర్లో జనం అర్ధరాత్రులు గాలించడం మొదలుపెడతారు. ఆ సమయంలో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి? ఈ కథలో శైలజ (పాయల్) ఎవరు? ఆ రెండు జంటలు చనిపోవానికి కారణం ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
ఇది శైలజ కథ. కానీ కథ చెప్పినప్పుడు ఆమె పేరు ముందు వరుసలో రాలేదు. ఎందుకంటే.. ఈ కథని దర్శకుడు రాసుకున్న విధానం అలాంటిది. ఈ కథలో అసలు పాత్రధారి శైలజని విరామ ఘట్టం వరకూ తెరపైకి తీసుకురాలేదు. శైలజ చిన్నప్పటి ఎపిసోడ్ తో కథని మొదలుపెట్టాడు దర్శకుడు. తర్వాత విలేజ్ లో జంట మరణాల చుట్టూ సన్నివేశాలని నడిపాడు. అయితే ఈ సన్నివేశాలు ఏవీ కూడా కథని ముందుకు తీసుకెళ్తున్న భావన కలిగించవు. అయితే డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాట్రన్, యంగేజింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏదో సూపర్ నేచురల్ ఎలిమెంట్ వుందనే భ్రమ కల్పిస్తూ, అజయ్ ఘోష్ నాటు కామెడీ తో పాటు జంట మరణాలు, వాటి చుట్టూ వున్న పాత్రలతో సోసోగానే ఇంటర్వెల్ వరకూ లాగించేశారు.
ఇంటర్వెల్ తర్వాత అసలు కథ మొదలౌతుంది. ఐతే అప్పటివరకూ ఈ కథని ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా నడిపిన దర్శకుడు… సడన్ గా దీన్ని క్యారెక్టర్ బేస్డ్ కథ మలిచే ప్రయత్నం చేశాడు. ఈ మార్పుకి ఎడ్జిస్ట్ కావడానికి ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. శైలజ ప్రేమ, అమ్మమ్మ దూరం కావడం, తనకో సమస్య వుండటం..గ్రామ బహిష్కరణ.. ఇవన్నీ తెరపై చూస్తున్నపుడు.. ఆ పాత్రపై సింపతీ రావాలి. కానీ అలా జరగలేదు. ఇదంతా ఓవర్ డ్రమటిక్ వ్యవహారంలా తయారైయింది. అయితే చివరి ఇరవై నిమిషాల్లో వచ్చే మలపుల్ని బాగానే తీర్చిదిద్దారు. అందులో కొన్ని మలుపులు థ్రిల్ చేస్తే.. ఇంకొన్ని మాత్రం అవసరానికి మించి వున్నట్లు అనిపిస్తాయి. పైగా ఇందులో చాలా సన్నివేశాలని ప్రేక్షకులని ఏమార్చడానికి, ట్రైలర్ కట్ కోసం పెట్టుకున్నట్లు అనిపిస్తాయి. కొన్ని ప్రశ్నలకు కూడా దర్శకుడు సమాధానం ఇవ్వలేదు. ఈ హత్యలన్నీ మంగళవారమే ఎందుకు జరగాలి? అసలు అక్రమ సంబంధాలకూ, ఈ కథకు లింకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అనేది అంతు చిక్కదు.
పాయల్ కే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త పాత్ర. ఆ పాత్ర చేయడానికి కాస్త సాహసం కావాలి. దర్శకుడిపై నమ్మకంతో ఆ పాత్ర చేయడానికి ముందుకు వచ్చింది పాయల్. తన వరకూ చక్కగా చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. అయితే కొన్ని చోట్ల శృతి మించిన ఎమోషన్ అనిపిస్తుంది. అంతే కాకుండా.. శైలు పాత్రని పూర్తిగా సెకండ్ హాఫ్ కే పరిమితం చేశాడు దర్శకుడు. దీంతో ఆ పాత్రతో ప్రేక్షకుడి అంత కనెక్షన్ ఏర్పడదు. పైగా ఫస్ట్ హాఫ్ అంతా టూమచ్ బిల్డప్ తో కాంతార తరహాలో ఏదో డివైన్ ఎలిమెంట్ వుందని భ్రమ కలిగించాడు దర్శకుడు. దీనికి సంబంధం లేని సెకండ్ హాఫ్ లోని ఆమె పాత్ర నడిచిన విధానం మైనస్ గా మారిపోయింది. ఎస్ఐ పాత్రలో చేసిన నందిత రగ్గడ్ గా కనిపించింది. ఈ విలేజ్ రివెంజ్ సస్పెన్స్ డ్రామాకి అజయ్ ఘోష్ పాత్ర కాస్త రిలీఫ్. ఆయన మాటలు, గెటప్. నటన భలే కుదిరాయి. జమిందారు ప్రకాశంగా చైతన్యతో పాటు మిగతా పాత్రల్నీ పరిధిమేర వున్నాయి. ఇందులో రెండు పాత్రలు సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. వాటిని తెరపైనే చూడాలి.
ఈ సినిమా సంగీత దర్శకుడు అజనీష్ తెర వెనుక హీరో అనుకోవాలి. తన సౌండ్ డిజైనింగ్ అదిరిపోయింది. కొన్ని సౌండ్ ట్రాకులు టెర్రిఫిక్ గా రిజిస్టర్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ముందుకు వెళ్ళదు. కానీ అటు ఎడిటర్ ఇటు మ్యూజిక్ డైరెక్టర్… ఇద్దరూ పోటీపడి యంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. కెమెరా వర్క్ బావుంది. వింటేజ్ పల్లెటూరు కనిపించింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఒక క్యారెక్టర్ వుంది. దర్శకుడు ప్రచార కార్యక్రమాల్లో చెప్పినట్టే ఇలాంటి క్యారెక్టర్ తో సినిమా ఇప్పటి వరకూ రాలేదు. తీసే ధైర్యం కూడా భవిష్యత్తులో చేయరు. ఆ క్యారెక్టర్ ని ఒక మామూలు రివెంజ్ డ్రామాకి సెట్ చేసి.. దాన్నే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకోసం దర్శకుడు సెట్ చేసిన సెటప్పులు కూడా కొత్తగా ఉన్నాయి. ఊర్లో రకరకాల పాత్రలు, వాటి నేపథ్యాలు, అమ్మవారి ఆలయం, ఊరి పెద్ద, డాక్టరు, ఓ చెప్పుకోలేని సమస్యతో బాధ పడుతున్న అమ్మాయి.. ఇలా చాలా పార్శ్వాలు, లెక్కలేనన్ని పాత్రలూ సెట్ చేసుకొన్నాడు. థ్రిల్లర్, హారర్, ఎమోషనల్… ఇలా చాలా యాంగిల్స్ లో ఈ కథని చూపించే ప్రయత్నం చేశాడు. ఇన్ని పాత్రలూ, ఇన్ని కోణాలూ ఉండేసరికి.. దేనికీ సరైన న్యాయం చేయలేదేమో అనిపిస్తోంది. అక్కడక్కడ దర్శకుడి పనితనం కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాంకేతిక నిపుణుల నైపుణ్యం దర్శనమిస్తుంది. దర్శకుడి ప్రయత్నం చివరి ఇరవై నిముషాలు కుదిరినంతగా సినిమా మొత్తం కుదరలేదు. చాలా విషయాల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడు. శైలు క్యారెక్టర్ ని ఉద్దేశించి డాక్టర్ ‘అసలు ఆ అమ్మాయి సమస్య ఈ వూర్లో ఎవరికైనా అర్ధమౌతుందా’ అంటాడు. నిజమే ఆ పాత్ర పెయిన్ ని తెలియజేసే బాధ్యత దర్శకుడిపై వుంది. కానీ దీనిపై సరైన కసరత్తు చేయలేదు. ఆ పాత్ర మూలాల్ని పట్టుకోలేదనిపించింది. ఆ పాత్రని సస్పెన్స్ థ్రిల్లర్ కి జోడించడంలో మరింత నేర్పు చూపించాల్సింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5