హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్న వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెట్టారు. ఎక్కడో ఉన్నాను కదా.. తననేమీ పీకలేరన్నట్లుగా పోస్టులు పెట్టి, న్యాయమూర్తుల్ని బూతులు తిట్టిన వారిలో మణి అన్నపురెడ్డి అనే వ్యక్తిపైనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఉండే ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ఇంటర్ పోల్ సాయం తీసుకుంటామని సీబీఐ కోర్టుకు చెప్పింది.
ఇప్పుడా మణి అన్నపురెడ్డి ఇండియాలో ఉన్నారు. అదీ ఏపీలో ఉన్నారు. జగన్ సభల్లో కనిపిస్తున్నారు. కాకపోతే ఆయన పేరు మార్చుకున్నారు. శివ అన్నపురెడ్డి అని పేరు పెట్టుకున్నారు. బోడిగుండు చేయించుకుని మీసాల్ని విచిత్రంగా పెంచుకుని ఎవరూ గుర్తు పట్టుకుండా తిరుగుతున్నారు. తెలియని వారు గుర్తు పట్టలేరేమో కానీ తెలిసిన వాళ్లు గుర్తు పడతారుగా. వైసీపీ నుంచి ఆయనెవరో బాగా తెలిసిన వాళ్లే మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా ఖాతాల వివరాలూ అందించారు. దాంతో గుట్టు రట్టయిపోయింది.
శివ అన్నపురెడ్డిగా ఆయన ఇండియాకు వచ్చారు. మరి మణి అన్నపురెడ్డి అనే పేరు ఎలా మార్చుకున్నారు ?. పాస్ పోర్టు కూడా నకిలీది తీసుకున్నారా ?. తన పేరును ఈజీగా మార్చేసుకుని ఇంటర్ పోల్ కన్ను పడకుండా వచ్చేస్తారా ?. చిన్న లుకౌట్ నోటీసు జారీ చేస్తేనే.. ఎయిర్ పోర్టులో నిర్బంధించి తీసుకెళ్తారు కదా. మరి ఈ శివ అలియాస్ మణి అన్నపురెడ్డి ఎలా తప్పించుకున్నారు ?
ఇప్పుడీ విషయం సంచలనంగా మారుతోంది. సీబీఐ ఈయనను అరెస్టు చేయడం ఖాయం. దొరకకుండ మళ్లీ విదేశాలకు పరారవుతాడా సరెండర్ అవుతాడా లేకపోతే జగన్ రెడ్డి పక్కన ఉంటే ఎవరూ ఏమీ చేయలేరని అక్కడే ఉంటారా ?