హైదరాబాద్: మణిరత్నం చిత్రంలో నటించటం తన కల అని నాని ఎప్పుడూ చెబుతుంటారు. ‘ఓకే బంగారం’ చిత్రంలో హీరో దుల్కర్ సల్మాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పమని అడిగితేనే ఆనందంగా ఒప్పుకున్నారు. ఇక ఆయన చిత్రంలో హీరో పాత్ర అవకాశం వస్తే నాని పరిస్థితి ఎలా ఉంటుందో.
కార్తి, దుల్కర్ హీరోలుగా తమిళం, తెలుగు భాషలలో తాను రూపొందిస్తున్న చిత్రంనుంచి మణిరత్నం దుల్కర్‌ను తొలగించినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాత్రలో నానిని బుక్ చేసుకున్నట్లు తేలింది. దుల్కర్‌కు తెలుగులో కార్తికి ఉన్నట్లుగా మార్కెట్ లేనందున అతను వద్దని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లుకూడా మణిరత్నానికి సూచించారట. మరోవైపు నానికి తమిళం, తెలుగు భాషలు రెండింటిలో మార్కెట్ ఉండటంతో దుల్కర్‌కు ప్రత్యామ్నాయంగా అతనిని తీసుకోవటానికి మణిరత్నం డిజైడ్ అయ్యారట. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నిత్య మీనన్, కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే భలే భలే మగాడివోయ్ చిత్రం సక్సెస్ మీట్‌ను అమెరికాలో జరుపుకుని తిరిగొచ్చిన నాని, మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం ఇంత విజయం సాధిస్తుందని తానుకూడా ఊహించలేదని చెప్పారు. అమెరికాలో తెలుగు చిత్రాలలో టాప్ టెన్‌లో ఇది స్థానం సంపాదించుకుందని, ఏడవ స్థానంలో నిలిచిందని తెలిపారు. ప్రీ ప్రమోషన్ చిత్రం విజయానికి కీలకమని అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ కొనసాగుతోందని, దీనికి కూడా ప్రీ ప్రమోషన్ బాగా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.