అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా బయటకు వచ్చాక విజయ్‌కి అభిమానులూ పెరిగారు. యువ హీరోలు సైతం ఈర్ష్య, పోటీ తత్వం వదిలి – ‘ఆ పాత్రని విజయ్ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు’ అంటూ మెచ్చుకొంటున్నారు. ఈ విజయంతో తెలుగు పరిశ్రమనే కాదు, మిగిలిన చిత్రసీమల్నీ ఆకట్టుకొన్నాడు. ప్రస్తుతం మణిరత్నం దృష్టి విజయ్‌పై పడింది. విజయ్ తో మణిరత్నం ఓ సినిమా చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మణి సినిమా అంటే ఇక చెప్పేదేముంది? ఇలాంటి అవకాశం కోసమే కాచుకొన్న విజయ్.. వెంటనే ఓకే అనేశాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో రీమేక్ చేసే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. యష్ రాజ్ సంస్థ అర్జున్ రెడ్డిని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లనున్నదని సమాచారం. అందులో భాగంగా కరణ్ జోహార్ ఇటు విజయ్‌తోనూ, అటు సందీప్‌తోనూ చర్చలు జరుపుతున్నార్ట. అర్జున్ రెడ్డి బాలీవుడ్‌కి వెళ్తే… అందులో విజయ్‌నే కథానాయకుడిగా నటిస్తారని సమాచారం. దానికీ సందీప్‌నే దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. సో… అర్జున్ రెడ్డితో విజయ్‌కి బాలీవుడ్‌లోనూ తలుపులు తెరచుకొన్నాయన్నమాట.