మణిరత్నం అంటేనే అంత! ‘ఆహా.. అద్భుతం.. ఆయనతో పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం’ అంటుంటారు. కానీ.. కాస్త పేరొచ్చేసరికి… మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చినా – ఆచి తూచి స్పందిస్తుంటారు. మణి ఫామ్ కూడా అలానేఉంది. ఆయన ఓ ప్రాజెక్టు అనుకోవడం, హీరోల్ని ఎంపిక చేసుకోవడం.. మధ్యలో వాళ్లు మారిపోవడం గత కొన్నాళ్లుగా ఇలానే జరుగుతోంది. తాజాగా మణి సినిమాకి మరో స్పీడ్ బ్రేకర్. తెలుగు, తమిళ భాషల్లో ఆయనో సినిమా తీద్దామనుకుంటున్నారు. తెలుగు నుంచి కథానాయకుడిగా అర్జున్ రెడ్డిగా మురిపించిన విజయ్ దేవరకొండని ఎంచుకున్నారు. స్టోరీ నేరేషన్, డేట్లని ఫిక్స్ చేసుకోవడం అన్నీ అయిపోయాయి. కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ దేవరకొండ తప్పుకున్నట్టు సమాచారం. విజయ్ స్థానంలో మరో కథానాయకుడ్ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు మణిరత్నం. అర్జున్ రెడ్డి తరవాత తెలగులో విజయ్ దేవరకొండ పాపులారిటీ డబుల్, ట్రిపుల్ అయ్యాయి. అవకాశాలూ భారీగా వస్తున్నాయి. ఈ దశలో మణిరత్నం అడిగినన్ని డేట్లు సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్తప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి విజయ్ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి.