తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాడు మణిశర్మ. రాజ్ – కోటిల శకం ముగిశాక… తెలుగు సినిమాని తన సంగీతంతో ఉర్రూతలూగించాడు. టాప్ స్టార్ తో ప్రాజెక్ట్ అనగానే మ్యూజిక్ గురించి మరో విషయం ఆలోచించకుండా మణి చేతిలో సినిమాని పెట్టేసేవారు. చిరు, నాగ్, వెంకీ, బాలకృష్ణ, మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్.. వీళ్లందరికీ సూపర్ హిట్లు ఇచ్చాడు మణిశర్మ. అయితే దేవిశ్రీ ప్రసాద్, థమన్‌ల రాకతో మణి జోరు తగ్గింది. వీళ్ల జోరుని మణి అందుకోవడంలో తడబడ్డాడు. పైగా హిట్లూ మొహం చాటేశాయి. దాంతో మణి ప్రభంజనం మాయమైపోయింది. మణిశర్మ అడపాదడపా పనిచేస్తున్నాడు గానీ తనదైన ముద్ర వేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు. అయితే.. ఈసారి మణి పనితనానికి మరో నిదర్శనంగా నిలిచింది.. నాని సినిమా జెంటిల్ మెన్.
జెంటిల్ మెన్ ఆడియో ఫంక్షన్లో మణి చాలా హుషారుగా కనిపించాడు. లైవ్ ఆర్కెస్ట్రాతో అదరగొట్టాడు. అప్పుడే అర్థమైంది.. మణి కొత్త మణిలా రూపాంతరం చెందుతున్నాడని. ఆ జోరు… జెంటిల్మెన్ సినిమాలోనూ చూపించాడు. ఈ సినిమాలో రెండు పాటలు పాత మణిని గుర్తు తెచ్చేలా సాగాయి. నేపథ్య సంగీతంలో మణి మార్క్ తిరుగులేనిది. ఈ సినిమాలో దాన్ని సూపర్బ్ గా ప్రజెంట్ చేశాడు మణిశర్మ. ఆర్.ఆర్ బిట్లు కొన్ని హాంటింగ్‌గా ఉన్నాయి. ఆర్.ఆర్తో.. సినిమా లెవిల్ ని పెంచాడన్న పేరు తెచ్చుకొన్నాడు మణి. మొత్తానికి జెంటిల్మెన్ తో మణిశర్మ ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. మణి అభిమానులకు ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్‌కి ఇంతకంటే శుభవార్త ఇంకేముంటుంది?