పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం దిశగా అవసరమైన వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గానే దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్‌లు చర్చలు జరుపుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. బుధవారం రాహుల్ వీరితో చర్చించనున్నారు.
ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిలను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. దివంగత సీఎం వైఎస్సార్ కూతురుగా షర్మిల ఇమేజ్ కాంగ్రెస్‌కు కలిసొస్తుందని, అదే సమయంలో ఆమె సోదరుడు, సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైసీపీని ధీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. ఇప్పటికే జగన్ పైన అసంతృప్తిగా ఉన్న పలువురు వైసీపీ నేతలు షర్మిలతో టచ్‌లో ఉన్నారని, షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన పక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వలసలు సాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. షర్మిల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ప్రకటించారు. అయితే తొలుత ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితమవ్వాలని నిర్ణయించుకోగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెను ఒప్పించినట్లుగా తెలుస్తుంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై జనవరి 1వ తేదీన అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం సాగుతుంది. వచ్చే లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ భావనగా ఉందని పార్టీ వర్గాల సమాచారం. . వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో తుడుచుపెట్టుకుపోయిన కాంగ్రెస్‌కు చట్టసభల్లో ప్రాతినిధ్యం కూడా కరవైంది. కాంగ్రెస్ మెజార్టీ కేడర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడైన వైఎస్. జగన్మోహన్రెడ్డి పార్టీ వైసీపీలో కలిసిపోయింది. ఈ క్రమంలో ఏపీలో తిరిగి రాజకీయంగా పుంజుకోవాలంటే, వైసీపీని, టీడీపీలకు ధీటైన శక్తిగా మారాలంటే వైఎస్సార్ కూతురు షర్మిల సారధ్యం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం తలపోస్తుంది.