పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రాజకీయ అభివృద్ధి కోసం.. టీడీపీ, బీజేపీ నేతలు ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యలరావు, టీడీపీకి చెందిన జడ్ పి చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజుల మధ్య పరిస్థితి ఉప్పునిప్పులా ఉంది. అప్పట్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ టికెట్ ను బాపిరాజు ఆశించారు. కానీ పొత్తులో ఆ టికెట్ ను బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరఫున పోటీచేసి మాణిక్యలరావు గెలుపొందారు. అప్పటి నుంచి వారి మధ్య అభిప్రాయభేదాలు, ఆధిపత్యపోరు జరుగుతోంది. కొన్నాళ్ల క్రితం .. తాడేపల్లిగూడెంలో నిట్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం సమయంలో విభేదాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. వేదికపైకి వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన మునిసిపల్ కౌన్సిలర్లను అనుమతించిన నిర్వాహకులు.. టీడీపీ కౌన్సిలర్లను అనుమతించలేదు.
దాంతో కార్యక్రమం జరుగుతున్న సమయంలో టీడీపీ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. ఆ తరువాత జరిగిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు మాణిక్యలరావును ఆహ్వానించడం మానేశారు. దీనిపై మాణిక్యాల రావు టీడీపీపై ఆరోపణలు చేశారు. విమానాశ్రయ భూములను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న అయిదువేల మందికి పట్టాలు ఇవ్వాలని, నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన 56 హామీలను అమలుచేయాలని మాణిక్యలరావు డిమాండ్లు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం అభివృద్ధి టీడీపీ హయాంలో ఎంత జరిగిందో… జడ్పీ చైర్మన్ బాపిరాజు లెక్కలు చెప్పారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. విమానాశ్రయ భూములను ఆక్రమించుకున్న వారిలో 18వందల మందికి తొలివిడతగా పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. అమలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందనేది టీడీపీ నేతల ఆరోపణ. ఎవరు నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ కు సిద్దం అని మాణిక్యలరావు జవాబిచ్చారు.
దాంతో ఎనిమిదవ తేదీన వెంకట్రామన్నగూడెంలో చర్చకు సిద్దంగా ఉండాలని బాపిరాజు ప్రకటించారు. ఇరువర్గాలు బహిరంగచర్చకు సిద్దం అవడంతో పోలీసులు ముందుజాగ్రత్తగా 144వ సెక్షన్ విధించారు. ఈ రోజు చర్చ జరగకుండా తాడేపల్లిగూడెంలో మాణిక్యలరావును, వెంకట్రామన్నగూడెంలో బాపిరాజును అరెస్టు చేశారు. మాణిక్యాలరావుకు మద్దతు తెలిపేందుకు గుంటూరు నుంచి కన్నా, జీవీఎల్ బయలుదేరారు. కానీ పోలీసులు గుంటూరు శివార్లలో నిలిపి వేసి.. కన్నా ఇంటికి తరలించారు. అక్కడ మీడియా సమావేశం పెట్టి ఏపీలో శాంతిభద్రతలు లేవని.. కన్నా, జీవీఎల్ ఆరోపించారు.