మిత్ర ధర్మం… తెలుగుదేశం, భాజపాల మధ్య ఈ ధర్మ పాలన చర్చే ఈ మధ్య తెరమీదికి వచ్చింది. టీడీపీ, భాజపా మిత్రపక్షాలు కాబట్టి, పరస్పరం విమర్శలు చేసుకోకూడదు.. ఇదే మిత్రధర్మం అంటే! అయితే, భాజపా నేతలు ఈ మధ్య ఎన్ని విమర్శలు చేస్తున్నా… తాము సైలెంట్ గా ఉండటానికి కారణం ఈ ధర్మ పాలనే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనుకోండీ..! అయితే, ఇదే అంశంపై ఏపీ భాజపా మంత్రి మాణిక్యాలరావు స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాటిస్తున్నట్టే తాము కూడా మిత్ర ధర్మం పాటిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకుల్ని విమర్శలు చేయకుండా అదుపు చేస్తామని మాణిక్యాలరావు మాటిచ్చారు! తెలుగుదేశం పార్టీతో ఇకపై ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తామని ఆయన చెప్పడం విశేషం..!
పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపులు, ఏపీకి కేంద్రం చేస్తున్న సాయం, మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు… ఇలాంటి అంశాలపై ఈ మధ్య ఏపీ భాజపా నేతలు స్వరం పెంచిన సంగతి తెలిసిందే. టీడీపీని లక్ష్యంగా వారు చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి… మిత్రధర్మం పాటిస్తున్నాం కాబట్టి మాట్లాడటం లేదనీ, ఒకసారి పొత్తు వద్దునుకుంటే నమస్కారం పెట్టేసి, ఆ తరువాత మాట్లాడుకుందాం అని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కొంతమంది ఏపీ భాజపా నేతల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన ఆగ్రహంగా చెప్పుకోవచ్చు. అంతేగానీ… ఏపీ భాజపా నేతల వ్యాఖ్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనో, లేదా రాష్ట్ర నేతలు చేస్తున్న విమర్శల్ని భాజపా పెద్దల వైఖరిగానో ఆయన చూడలేదని కూడా స్పష్టంగానే ఉంది. చంద్రబాబు ఇలా స్పందించేసరికి… మరోసారి టీడీపీ, భాజపా పొత్తు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అనే విశ్లేషణలు చాలా వచ్చేశాయి.
అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై మరింత రాద్ధాంతం చేయకుండా.. కొంత దిద్దుబాటు చర్యలకు ఏపీ భాజపా ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది. ఏపీ భాజపా నేతలు కూడా ఈ మిత్రధర్మం పేరుతో మొదలైన చర్చకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే ఉన్నట్టు మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి.అంటే, ఇకపై పొత్తు పేరుతో లాభనష్టాలను బేరీజు వేస్తుండే సోము వీర్రాజు విమర్శలు ఉండవని అనుకోవచ్చా..? కేంద్ర కేటాయింపులపై ఘనత తమకు దక్కనీయడం లేదంటూ చంద్రబాబుపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే పురందేశ్వరి ఆగ్రహాలు వినిపించవని భావించొచ్చా..? మిత్ర ధర్మం అంటే అదే కదా! అది సాధ్యమేనా..? ఏం జరుగుతుందో మరి..!