చంద్రబాబు ఇంకా తనను తాను ముఖ్యమంత్రిగానే ఊహించుకుంటున్నారని.. వైసీపీ నేతలు అప్పుడప్పుడు విమర్శలు చేస్తూంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు కూడా విమర్శిస్తూంటారు. ఆ రెండు పార్టీలు… అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి స్థానాలు మార్చుకుని ప్రతిపక్ష, అధికార పార్టీలుగా మారాయి కాబట్టి.. ఆయా పార్టీల నేతలు అలా విమర్శలు చేసుకుంటారు. ఇతర పార్టీల నేతలకూ అలాగే అనిపిస్తే మాత్రం కాస్త విచిత్రమే. గత ప్రభుత్వంలో నాలుగేళ్ల పాటు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు… అసెంబ్లీలో అటు చంద్రబాబు.. ఇటు జగన్ ప్రవర్తనను… అలాగే విశ్లేషించారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత సీఎంగా.. సీఎం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారని సెటైర్ వేశారు. గత ప్రభుత్వ అవినీతిపై పదేపదే విమర్శలు చేస్తున్న జగన్.. ఏ చర్యలూ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.
జగన్మోహన్ రెడ్డి… తో పాటు.. వైసీపీ నేతలు కూడా… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తాము ఎలాంటి ఆరోపణలు చేశారో.. చేతికి అధికారం వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. దాదాపుగా నెలన్నర రోజులు గడిచినప్పటికీ.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు కానీ.. ఏ ఒక్క దానిపైనా ఆధారాలు బయట పెట్టలేదు. అసెంబ్లీలోనూ అవే తరహా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి టీడీపీ అధికారపక్షం తరహాలో కౌంటర్ ఇస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే.. బీజేపీ నత మాణిక్యాలరావుకు.. అలాగే అనిపించింది. రాజకీయాలు ఫాలో అవుతున్న చాలా మందికీ… అదే పరిస్థితి.
ఇలాంటి విమర్శలు కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీగా ఉన్న చంద్రబాబు.. సీఎంగా ఊహించుకుని.. ఆ విధంగా వ్యవహరిస్తే.. ఇబ్బందేమీ ఉండదు కానీ.. సీఎం ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తే మాత్రం… టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అది వైసీపీకి మైనస్ అవుతుందనే అభిప్రాయం ఉంది.