కేంద్ర మంత్రులు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి, తెదేపా ప్రభుత్వంపై ఆయన చెపుతున్న పిర్యాదులను శ్రద్ధగా ఆలకించినందుకు తెదేపా నేతలు, మంత్రులు విమర్శలు గుప్పించారు. ప్రతీ క్రియకి ప్రతి క్రియ ఉంటుందని న్యూటన్ మహాశయుడు ఎప్పుడో చెప్పాడు కనుక తెదేపా విమర్శలకి ప్రతిక్రియ సహజమే. ఆ ప్రతిక్రియ ఏ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటివి వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇంకా సహజంగా ఉండేది కానీ తెదేపా ప్రభుత్వంలో దేవాదాయశాఖా మంత్రిగా ఉన్న మాణిక్యాల రావు నుంచి రావడమే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షనేత, ఏమ్మేల్యే అయిన జగన్మోహన్ రెడ్డిని కేంద్రమంత్రులు కలవడం అసాధారణ విషయమేమీ కాదు. గతంలో చాలాసార్లు ఆయన కేంద్రమంత్రులను కలిశారు. ఇది కూడా అటువంటిదే తప్ప దానికి ప్రత్యేకత ఏమీ లేదు. దానిని తప్పు పట్టనవసరం లేదు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న యనమల రామకృష్ణుడుకి ఆ సంగతి తెలియదనుకోలేము. అయన దీని గురించి ఏమ్మన్నారో, ఏ సందర్భంగా అన్నారో పూర్తి వివరాలు నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం తప్పేమీ కాదు. ఒకవేళ కేంద్రమంత్రులు ఆయనని కలవడం తప్పనుకొంటే, మరి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మీ మంత్రులు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత అనే కదా? మీరు చేస్తే ఒప్పయినది మేము చేస్తే తప్పేలా అవుతుంది?” అని ప్రశ్నించారు.
ఆయన మరొక మాట కూడా చెప్పారు. “వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలో చేర్చుకోవడం వారి విజ్ఞాతకి సంబందించిన విషయం,” అని అన్నారు. అంటే తెదేపా చేస్తున్న ఆ పని భాజపాకు నచ్చలేదని చెపుతున్నట్లే ఉంది. తెదేపాకి మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందునే దానిపై బహిరంగంగా అభ్యంతరం చెప్పలేకపోతున్నట్లు భావించవచ్చు.
ఏమయినప్పటికీ తెదేపా నేతలు కేంద్రమంత్రులని నేరుగా విమర్శించడం, వైకాపా ఎమ్మెల్యేల చేరిక గురించి రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడటం రెండూ కూడా కొత్త పరిణామాలుగానే చూడవచ్చు. బహుశః అవి తెదేపా-భాజపాల సంబంధాలు త్వరలోనే కొత్త మలుపు తీసుకోబోతున్నట్లు సూచిస్తున్నట్లుగానే ఉన్నాయి.