ఉన్నత స్థానాల్లో వున్నవారు ఏదైనా మాట్లాడేప్పుడు జాగ్రత్తగా వుండాలి. అవసరం లేనివి అసలు మాట్లాడకూడదు. అయితే బిజెపి ఆరెస్సెస్ నేపథ్యం వున్న నేతలు రోజూ ఎన్నెన్నో వివాదాస్పద వికృత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటాం. ఎపి మంత్రి మాణిక్యాల రావు పరిస్థితి అలాగే తయారైంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ కేసులో కుట్ర కోణం వుందని ఆయన ఎందుకు అన్నట్టు? హిందూ ధర్మం, సేవ్ టెంపుల్స్, ఆలయ వాణి వంటి పేర్లతో గజల్‌కు సంబంధం వుందనా? నిజానికి మంత్రి అలా అనడంలోనే ఏదో కుట్ర కోణం దాగి వుందని నాకనిపించింది. వీలైతే గట్టిగా ఖండించవచ్చు లేదంటే మౌనంగా వుండిపోవచ్చు గాని బాధితురాలు అన్ని సాక్ష్యాలు అందించిన తర్వాత కూడా వెనకేసుకురావాలనే తాపత్రయం ఎందుకో! అయితే ఈ సమర్థన మరీ దారుణంగా వుంది గనక మరుసటి రోజుకల్లా మంత్రి చెంపలు వేసుకోవలసి వచ్చింది. మహిళల పట్ల వికృతంగా ప్రవర్తించినట్టు చూసి అతనిలో రెండో కోణం తెలుసుకున్నానని మంత్రి ఇప్పుడంటున్నారు. వాస్తవానిక ఈ రెండు రోజులుగా నడుస్తున్న రచ్చ అంతా అదే . మిశ్రమ ప్రభుత్వంలో వున్న మాణిక్యాల రావు మాటలు బాగా లేవని తెలుగుదేశం నేతలందరూ భావించారు. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా చేరింది. ఈ నేపథ్యంలోనే సూటిగా మాట్లాడింది వెనక్కు తీసుకోమని మాణిక్యాల రావుకు తాఖీదు వెళ్లింది. ఆయన అనుయాయుల్లోనూ విముఖత కనిపించింది.వాస్తవంగా గతంలోనూ ఈయన కొన్ని వివాద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ఇవన్నీ గమనించాకే తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటానన్నారు. అలా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నానని కూడా చెప్పారు. ఇంతగా చెబుతున్నారు గనక మళ్లీ అలా చేయబోరని ఆశిద్దాం.