ప్రస్తుతం భారత దేశ పార్లమెంటు, మీడియా, సోషల్ మీడియా సహా యావత్ దేశాన్ని మణిపూర్ సమస్య మీద జరుగుతున్న చర్చ కుదిపేస్తోంది. గత రెండు మూడు నెలలుగా ఇక్కడ జరుగుతున్న హింస లో 150 కి పైగా మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడంతో పాటు, మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడడం వంటి సంఘటనలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియడంతో, మరీ ఇంత అనాగరికమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయా అన్న ఆవేదన,ఆశ్చర్యం దేశంలో కనిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన మూల కారణాలు పూర్తిగా తెలియక ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఈ సమస్యను విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యకు సంబంధించిన పూర్తి కారణాలను మూలలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రతి చోటా, ప్రతిసారి, హింసను ఆందోళనను ప్రేరేపించిన తక్షణ కారణాలు కొన్ని ఉంటే, అసలు సమస్య ఏర్పడడానికి మూలమైన చారిత్రక మరియు దీర్ఘకాలిక కారణాలు ఇంకొన్ని ఉంటాయి. అటువంటి దీర్ఘకాలిక కారణాలను తెలుసుకోకుండా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోలేం.
మణిపూర్ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఉన్న తెగల గురించి తెలియాలి. మణిపూర్ లో అనేక రకాల తెగలు ఉండగా వీటిలో ప్రధానంగా మూడు తెగలు కనిపిస్తాయి.
మెయిటి
నాగ
కుకి
ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన మెయిటి వర్సెస్ (నాగ మరియు కుకి).
భౌగోళిక కారణాలు:
ఏ దేశ చరిత్ర నైనా నిర్దేశించేది ఆ దేశంలోని భౌగోళిక పరిస్థితులే. అందుకే చరిత్రను అర్థం చేసుకోవాలంటే ముందు ఆ ప్రాంత జాగ్రఫీ తెలియాలి. మణిపూర్ రాష్ట్రం దాదాపు 90% కొండ ప్రాంతాలతో నిండి ఉంటుంది. కేవలం 10 శాతం మాత్రమే చదునైన నేల ఉంటుంది. పైన చెప్పుకున్న మూడు తెగలలో మెయిటి తెగవారు ప్రధానంగా ఈ చదునైన నేల కలిగిన లోయ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. మిగిలిన 90 శాతం కొండ ప్రాంతాలలో నాగ మరియు కుకి తెగలవారు నివసిస్తూ ఉంటారు . ఈ కారణంగా స్వతహాగా మెయిటి తెగకు చెందిన వారు విద్యాపరంగా, ఉద్యోగాలపరంగా మాత్రమే కాకుండా రాజకీయపరంగా కూడా మిగతా తెగల కంటే ముందంజలో ఉంటారు. ఈ కారణంగానే రిజర్వేషన్ల పరంగా నాగ మరియు కుకి తెగలకు ఎస్టి అంటే గిరిజన హోదా ఉండగా, మెయిటి ప్రజలకు గిరిజన హోదా లేదు. తమకు కూడా గిరిజన హోదా కావాలని వీరు ఆందోళన చేస్తుండగా, వారికి గిరిజన హోదా ఇవ్వద్దని ఇతర తెగలవారు ఆందోళన చేస్తున్నాయి. ఈ రెండు ఆందోళన నడుమ జరిగిన హింసాత్మక ఘటనలే మణిపూర్ లో తాజా పరిస్థితికి కారణం. అయితే రాజకీయ అధికారం కూడా కలిగిన మెయిటి ప్రజలు ఎందుకు గిరిజన హోదా కోరుతున్నారు అన్నది కాసేపట్లో చూద్దాం.
చారిత్రక, రాజకీయ కారణాలు:
1891 నుండి బ్రిటిష్ పాలన లో ఉండి 1947 లో స్వతంత్రాన్ని పొందుకుంది. అయితే బ్రిటిష్ వారు ఏ రాజ కుటుంబాన్నుండి అయితే 1891 లోఅధికారాన్ని హస్తగతం చేసుకున్నారో అదే కుటుంబానికి 1947 లో తిరిగి అధికారాన్ని ఇవ్వడంతో ఆ రాజు భారతదేశంలో కలవకుండా స్వతంత్ర దేశంగా పాలించడానికి మొగ్గు చూపారు. అయితే అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి అనేక ప్రిన్స్లి స్టేట్స్ ని నయానో భయానో భారత్ లో విలీనం చేయించారు. ఆ రకంగా 19 49 లో మణిపూర్ భారత్ లో భాగమైంది. అయితే 1891 ముందు, అదేవిధంగా 1949 తర్వాత రాజకీయ అధికారం ప్రధానంగా మెయిటి తెగకు పరిమితం అయింది. ఇది ఇతర తెగలలో వీరి పట్ల వ్యతిరేకత కలగడానికి కారణం అయింది. ప్రస్తుతం మణిపూర్ ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం లో కూడా అగ్ర భాగం మెయిటి తెగ వారే.
మతపరమైన కారణాలు:
చదునైన ప్రాంతంలో నివసిస్తూ మిగతా తెగల కంటే అడ్వాన్స్ గా ఉండే మెయిటీ తెగవారు ప్రధానంగా హిందూ మతాన్ని అనుసరిస్తే, కొండ ప్రాంతాల్లో ఉండే నాగ తెగవారు క్రిష్టియనిటీ అనుసరిస్తున్నారు. ఇక కుకి తెగవారు కొందరు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తుండగా ఇంకొందరు ప్రాంతీయ గిరిజన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటికే ఇతర కారణాలవల్ల ఉన్న వైరుధ్యాలు మతపరమైన కారణాలవల్ల మరింత ప్రస్ఫుటంగా మారాయి. పైగా నాగ మరియు కుకి లు ఉండే కొండ ప్రాంతాలలో ఇటీవల కాలంలో అనుమతులు లేకుండా కట్టారంటూ ఒక చర్చిని కూల్చివేయడం మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. అందులో నూ బిజెపి పాలిత రాష్ట్రంలో చర్చి కూల్చివేత అన్నది ఎంతటి సున్నితమైన అంశం అన్నది చెప్పవలసిన అవసరం లేదు.
సామాజిక కారణాలు:
ముందు చెప్పుకున్నట్లు అభివృద్ధి చెందిన మెయిటి తెగవారు కూడా గిరిజన హోదా కోరడం దశాబ్దాలుగా ఉన్న సమస్యకు మరింత ఆజ్యం పోసింది. అయితే వీరు అలా కోరడానికి ఒక కారణం ఉంది. మణిపూర్ మాత్రమే కాకుండా భారతదేశంలోని పలు ప్రదేశాలలో, బయటి వ్యక్తులు వెళ్లి గిరిజన ప్రాంతాలలో స్థలాలు కొనడం మీద ప్రభుత్వపరంగా కొన్ని ఆంక్ష లు ఉంటాయి. గిరిజనులకు మాత్రమే పరిమితమైన వారి జీవనశైలి, వారి ఉనికి, బయట వ్యక్తుల కారణం గా కలుషితం కాకుండా, వారి ఉనికి కోల్పోకుండా ఉండడం కోసం రాజ్యాంగం ఏర్పాటు చేసిన పరిరక్షణ విధానం ఇది. అయితే గిరిజనులు ఇతర ప్రాంతాలలోని భూమిని కొనుక్కోవడం మీద ఎటువంటి ఆంక్ష లు ఉండవు. అయితే 10 శాతం నేల ఉన్న తమ ప్రాంతం లోకి ఇతర తెగలవారు వచ్చి భూములు కొంటున్నారని, మిగతా 90 శాతం ప్రాంతం భూమిని తాము కొనలేక పోతున్నామని, అందుకే తమకు గిరిజన హోదా కావాలని మెయిటి తెగ వారు అడుగుతున్నారు. అయితే ఇతర తెగల వారు మాత్రం, పూర్తిగా అభివృద్ధి చెంది, రాజకీయ ఆధిపత్యం కూడా కలిగిన గిరిజన హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని, తన ప్రాంతాలు కొనే అవకాశం వీరికి ఇస్తే తమపై పెత్తనం చేస్తారని, తమ తెగలు ఉనికిని కోల్పోతాయని వారు భయపడుతున్నారు. ఈ హోదా సమస్య ఏళ్ల తరబడి రాజకీయ పార్టీలు నానుస్తూనే ఉన్నాయి. దీంతో ఇరు వర్గాలు కోర్టుమెట్లక్కాయి. ఈ లోగానే కోర్టు నిర్ణయం తమకు వ్యతిరేకంగా వస్తుందేమోనన్న భయం తో తెగలుగా ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనల క్రమంలోనే హింస చెలరేగింది. రాజకీయంగా బలహీనమైన కుకీ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరేగింపజేసి అత్యాచారం చేయడంతో సమస్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇతర కారణాలు:
పైన చెప్పుకున్న కారణాలతో పాటు అనేక ఇతర కారణాలు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. మణిపూర్ సరిహద్దు దేశాలైన మయన్మార్ తదితర ప్రాంతాల నుండి అక్రమంగా చొరబడుతున్న వలసదారులు కొండ ప్రాంతాలలోని నాగ మరియు కుకీ తెగల తో కలిసిపోయి దేశ సమగ్రతకు భంగం కలిగేలా చేస్తున్నారని, అంతేకాకుండా కొండ ప్రాంతాలలో ఉండే నాగ మరియు కుకీలు గంజాయి పండిస్తున్నారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మెయిటి తెగవారు ఆరోపిస్తూ ఉండగా, రాజకీయంగా బలహీనమైన తమ తెగల మీద అసత్య ప్రచారం చేస్తూ, తమను విద్రోహులుగా చూపిస్తున్నారని, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్ర ఇందులో ఉందని నాగ మరియు కుకీ తెగలవారు ఆరోపిస్తున్నారు.
ఇవీ ప్రస్తుత సమస్యకు ప్రధాన మూలకారణాలు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి విధానాలు అవలంబించవచ్చు అన్నది మరొక ఆర్టికల్ లో చూద్దాం
– జురాన్ ( @CriticZuran)