మణిరత్నం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ‘నవరస’. పేరుకి తగ్గట్టే తొమ్మిది ఎపిసోడ్లుంటాయి. ఒక్కో ఎపిసోడ్‌లోనూ ఒక్కో హీరో. ఒక్కో జోనర్లో ఒక్కో భాగం. ప్రతీ ఎపిసోడ్ కీ ఓ కొత్త దర్శకుడు. ఇదీ నవరస ఫార్ములా. సౌత్ ఇండియా స్థాయిలో అంటే తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. సౌత్ ఇండియా మొత్తానికి తెలిసిన నటీనటులనే ఎంచుకోవాలన్నది మణిరత్నం ప్రయత్నం. అందులో భాగంగా సూర్య, సిద్దార్థ్, మాధవన్‌లను ఎంపిక చేశాడు.
తెలుగు నుంచి కూడా ఇద్దరు ముగ్గురు హీరోల్ని తీసుకోవాలని మణిరత్నం భావిస్తున్నారు. నాని, నాగచైతన్య, నాగార్జున లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో అడుగుపెట్టి రాణిస్తున్న కార్తికేయ లాంటి పేర్లు కూడా మణిలిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయా హీరోలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టులో ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కానుంది. అప్పటికి ఏ హీరో కాల్షీట్లు అందుబాటులో ఉంటాయో చూసుకోవాలి. తెలుగు నుంచి కూడా ఇద్దరు దర్శకులు ఈ వెబ్ సిరీస్‌కి పనిచేస్తారని తెలుస్తోంది. వాళ్ల పేర్లు కూడా త్వరలోనే బయటకు వస్తాయి.