మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..”ఓకే బంగారం”తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన ‘కాట్రు వెలియిదాయ్’చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. ”చెలియా” అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్. ఇప్పుడు ‘సెక్క సివంద వానం’ అనే సినిమాని పూర్తి చేశారు మణిరత్నం. తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదల కానుంది. అరవింద్‌స్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్, జ్యోతిక, అతిథిరావు, ఐశ్వర్యా రాజేష్, ప్రకాశ్‌రాజ్ వంటి పెద్ద తారాగణం వుంది. ఈ నెల 27న సినిమ ప్రేక్షకులముందుకు వస్తుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ ఇంకా మొదలుకాలేదు. తమిళ్ వెర్షన్ కి సంబధించి ఆడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత మరో యాక్టివిటి కనిపించలేదు. ఇక తెలుగు వెర్షన్ కి సంబధించి ఇప్పటివరకూ ఎలాంటి ఈవెంట్ జరగలేదు. మణిరత్నంని తమిళ్ తెలుగు అనే తేడాలు లేకుండా అభిమానించే ఓ వర్గం వుంది. సినిమాని ప్రేమించే వర్గం అది. మణిరత్నం కూడా తన ప్రతి సినిమా విడుదల ముందు తెలుగులో కూడా ఒక ఈవెంట్ చేస్తుంటారు. ఇక్కడి వచ్చి సినిమా గురించి ప్రేక్షకులతో , మీడియాతో మాట్లాడుతారు. కాని నవాబ్ విషయంలో అది కనిపించడం లేదు. ఇంక సినిమా విడుదలకు పదిరోజులు కూడా లేదు. ఈ రోజుల్లో పబ్లిసిటీ ఎంత కీలకమో తెలియంది కాదు. ఐతే ప్రస్తుతం నవాబ్ తెలుగు వెర్సన్ కి సంబధించి ఎలాంటి యాక్టివిటీ కనిపించడం లేదు. మరి నవాబ్ యూనిట్ లో కదలిక వస్తుందా ? లేదా ఇలానే సైలంట్ గా థియేటర్ లోకి వదిలేస్తారో చూడాలి.