అదేంటో గానీ… మణిరత్నం సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడే హీరోలు, ఆయనతో సినిమా అంటే భయపడిపోతారు. కమర్షియల్ విలువలు ఉండవనో, బాక్సాఫీసు సూత్రాల్ని ఆయన పట్టించుకోరనో తెలీదు గానీ, తెలుగు హీరోలు మణిరత్నం తో సినిమా అంటే వెనకడుగు వేస్తారు. ఇన్నేళ్ల కెరీర్ లో మణిరత్నం తెలుగులో నేరుగా తీసిన సినిమా.. `గీతాంజలి` మాత్రమే. ఆ తరవాత.. తెలుగు హీరోతో ఆయన సినిమానే చేయలేదు. అయితే ఈమధ్య మణిరత్నం ఓ కథ పట్టుకుని టాలీవుడ్ టాప్ హీరోల చుట్టూ తిరుగుతున్నారు. కానీ… మనవాళ్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ని సైతం మణిరత్నం కలిశాడని ఆమధ్య వార్తలొచ్చాయి. అది నిజమే అని మణిరత్నం ధృవీకరించారు.
”మహేష్ తో సినిమా చేయాలనుకున్న మాట వాస్తవమే. ఆయనతో చర్చలు కూడా జరిగాయి. కానీ కుదర్లేదు. భవిష్యత్తులో ఓ మంచి కథ దొరికితే.. మహేష్ తో సినిమా చేస్తా“ అన్నారు మణి. నాగచైతన్య, రామ్… ఇలాంటి యంగ్ హీరోలతోనూ మణి టచ్లోకి వెళ్లారు. కానీ వాళ్లు కూడా `నో` చెప్పేశారు. ప్రస్తుతం `నవరస` అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కించారు మణిరత్నం. దీనికి మణిరత్నం నిర్మాత మాత్రమే. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.