ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 17 నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ… ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.
తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ దక్కింది. పాస్ పోర్టును అప్పగించాలని, దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాదారులను మభ్యపెట్టరాదని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆరోపణలతో ఓ వ్యక్తి ప్రాథమిక హక్కులను కాలరాయలేమని, ఓ వ్యక్తిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేమని, కింది కోర్టులు ఈ అంశాలను పట్టించుకోవాల్సిందని కామెంట్ చేసింది.
Also Read : సిసోడియాకు బెయిల్ .. కవిత బెయిల్ పై బీఆర్ఎస్ లో చిగురిస్తోన్న ఆశలు!
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అవినీతిలో కీలకంగా వ్యవహరించారని ఆనాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ, సీబీఐలు కేసులు నమోదు చేసి, గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేశాయి. ఆనాటి నుండి ఆయన జైల్లో ఉన్నారు. మధ్యలో తన భార్యకు అనారోగ్యం కారణంగా పెరోల్ లభించినా, రెగ్యూలర్ బెయిల్ కోర్టులు కొట్టివేశాయి.
అయితే, సిసోడియా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత సీఎం కేజ్రీవాల్ ను కలవకూడదని… అలా జరిగితే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందని విచారణ సందర్భంగా సీబీఐ లాయర్ వాదించారు.