కేరళ కుట్టీల హవా టాలీవుడ్లో ఎక్కువగానే ఉంటుంది. అక్కడి నుంచి కథానాయికలు టాలీవుడ్‌కి వలస వచ్చేస్తుంటారు. అలా వచ్చిన వాళ్లందరికీ తెలుగు చిత్రసీమ స్థానం కలిపిస్తూ.. వాళ్లని స్టార్లని చేసేస్తూ ఉంటుంది. మంజిమా మోహన్ కూడా అలాంటి ఆశతోనే తెలుగులోకి అడుగుపెడుతోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో తనే కథానాయిక. ఈనెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంజిమాతో తెలుగు 360.కామ్ చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇది.
* హాయ్ మంజిమా..
– హాయ్..
* తెలుగు అర్థం అవుతోందా?
– ఓ మాదిరిగా. ఇది వరకు ఎవరైనా తెలుగులో మాట్లాడితే.. దిక్కులు చూసేదాన్ని. ఇప్పుడు ఆ ప్రమాదం లేదు. తెలుగు నేర్చుకోవడానికి ఓ ట్యూటర్ని కూడా పెట్టుకొన్నా. ఇప్పుడు బాగానే అర్థం అవుతోంది.
* ఇదే మీ తొలి తెలుగు సినిమా… కానీ బాగా ఆలస్యం అయిపోయింది. కంగారేం పడలేదా?
– లేదు. ఎందుకంటే నటించడం వరకే మా పని. దాన్ని బయటకు ఎప్పుడు తీసుకురావాలా అనేది నిర్మాతలు ఆలోచిస్తారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా జనం చూస్తారు. గౌతమ్ సార్ సినిమాల క్రేజ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయన సినిమా ఆలస్యమైనా బాగుంటుంది అన్న నమ్మకం అందరికీ ఉంది.
* ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– గాళ్ నెక్ట్స్ డోర్ అంటారే… అలాంటి పాత్ర నాది. రోడ్ జర్నీ నేపథ్యంలో సాగే కథ ఇది. నా పాత్ర రెగ్యులర్‌గా ఉన్నా.. ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.
* గౌతమ్ మీనన్ స్టైల్ ఎలా ఉంది?
– సూపర్బ్. ఇది వరకు మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. నా గత సినిమాల అనుభవాన్ని… పక్కన పెట్టి ఈ సినిమాలో నటించా. గౌతమ్ సార్ కావల్సినంత స్వేచ్ఛ ఇస్తారు. `నిజ జీవితంలో నువ్వైతే ఎలా ప్రవర్తిస్తావో అలా చేయ్` అంటారంతే.
* తెలుగు సినిమాలు చూస్తున్నారా?
– ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకొంటున్నా. మనం, బాహుబలి, ఈగ సినిమాలు చూశా. బాగా నచ్చాయి.
* తెలుగు సినిమాల్లో హీరోయిన్గా రాణించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి అనుకొంటున్నారా?
– (నవ్వుతూ) మీరు మాట్లాడుతోంది గ్లామర్, ఎక్స్పోజింగ్ల గురించే అనుకొంటా. ఇది వరకు అలానే ఉండేదేమో? ఇప్పుడు పద్దతులు మారాయి. కథానాయికల ఆలోచన ధోరణి, దర్శకుల అభిప్రాయాలూ మారుతున్నాయి. హీరోయిన్ అంటే నాలుగు పాటలకు పరిమితం అనుకోడం లేదు. అందుకే నాలాంటి కథానాయికలూ రాణించగలుగుతున్నారు. నా మట్టుకు ఎక్స్‌పోజింగ్‌లకు నేను వ్యతిరేకం. దానిపై నాకు ఎలాంటి ఇంట్రస్ట్ లేదు.
* మీకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. అయినా… హీరోయిన్ అయిపోయారు. ఇంట్లో ఒప్పుకొన్నారా?
– నేను హీరోయిన్ అవుతా.. అని అమ్మతోనే ముందు చెప్పా. తను సరే అంది. నాన్నగారు మాత్రం షాక్ తిన్నారు. `అనుకోగానే ఎలా అయిపోతావ్, చాలా కష్టం` అన్నారు. కానీ నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించా. అయితే నాన్న సహకారం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. నేను అనుకొన్నది సాధిస్తానని ఆయనకు ముందే తెలుసనుకొంటా.
* కథల ఎంపికలో మీ ప్రాధాన్యాంశాలు ఏమిటి?
– కచ్చితంగా కథే. స్టార్ హీరోలతో, స్టార్ దర్శకులతోనే సినిమాలు చేయాలని గిరి గీసుకుని కూర్చోలేదు. కొత్త సినిమాలూ అద్భుతాలు చేస్తాయి. ఈ మధ్య పెళ్లి చూపులు సినిమా ఎంత సంచలనం సాధించిందో చూశాం కదా. ఈ సినిమా గురించి గౌతమ్ సార్ నాతో ఎన్ని సార్లు చెప్పారో. అందులో స్టార్లు ఎవరూ లేరు కదా??
* మీ చదువు మాటేంటి?
– బిఎస్సీ మాథ్స్ పూర్తి చేశా. ఇక చదివే ఉద్దేశం లేదు. సినిమాలతో పాటు చదువునీ కొనసాగిస్తా అంటూ ఇంట్లో వాళ్లకు మాటిచ్చా. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నా.
* తెలుగులో ఆఫర్లు ఏమైనా వస్తున్నాయా?
– ఇప్పటి వరకూ చాలా కథలు విన్నా. అందులో కొన్ని నచ్చాయి. అయితే తమిళంలో బిజీగా ఉండడం వల్ల వాటికి ఓకే చేయలేకపోతున్నా. ప్రస్తుతం 3 తమిళ చిత్రాలపై సంతకాలు చేశా. అవి పూర్తయ్యాకే తెలుగు సినిమాల్ని ఒప్పుకొంటా.
* తెలుగులో అభిమాన కథానాయకులు ఎవరు?
– ఆ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం.
* ఆల్ ద బెస్ట్…
– థ్యాంక్యూ…