తమిళనాడు, కేరళలను మనసిలాయో పాట ఓ ఊపు ఊపేస్తోంది. రజనీకాంత్ తాజా సినిమా వేట్టయాన్ లో మంజు వారియర్ డాన్స్ క్లిప్స్‌తో ఈ లిరికల్ సింగిల్ ను రిలీజ్ చేశారు. పాటలో రజనీకాంత్ స్టెప్స్ కూడా ఉన్నా… హంగామా మాత్రం మంజు వారియర్ దే.
మంజు వారియర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ… లేడీ ఒరియంటెడ్ సినిమాలతో మలయాళంలో స్టార్ గా మారారు. నటుడు దిలీప్ తో పెళ్లి విడాకుల తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2014లో హౌ ఓల్డ్ ఆర్ యూ పేరుతో వచ్చిన సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ మలయాళ హీరోయిన్ రేంజ్ గ్లామర్ స్టార్ క్రేజ్ మాత్రం.. తమిళ స్టార్ హీరోల సినిమాల్లోకి వచ్చిన తర్వాతే వస్తోంది.
అజిత్ తో కలిసి తూనివు సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో ఆమె ప్రజెన్స్ ఇంత కాలం ఈ నటిని ఎలా మిస్సయ్యామని సౌత్ ఇండస్ట్రీ అంతా అనుకునేలా చేసింది. ఇప్పుడు రజనీకాంత్ తో వేట్టయాన్ లో నటిస్తున్నారు. మనసిలాయో పాటకు ఆమె చేసిన డాన్స్ ఒక్క సారిగా వైరల్ గా మారింది. మంజు వారియర్ కు 46 ఏళ్ల వయసులో కొత్త క్రేజ్ ను ఈ అనిరుథ్ పాట తెచ్చి పెడుతోంది.
నిజానికి మంజు వారియర్ గ్లామరస్ గా కనిపించే పాత్రలు చేస్తారు కానీ.. గ్లామర్ కోసమే సినిమాలు చేయరు. సినిమాలో తనదైన ముద్ర వేసే అవకాశం వస్తేనే చేస్తారు. రజనీకాంత్ సినిమాలో అయినా మంజు వారియరే హైలెట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సాక్ష్యం.. తమిళనాడు, కేరళల్ని.. మనసిలాయో ఊపేస్తూండటమే.