నటిగా, నిర్మాతగా ఏవో కొన్ని ప్రయత్నాలు చేసింది ఘట్టమనేని వారసురాలు మంజుల. తాజాగా ఆమె మెగా ఫోన్ కూడా పట్టేసింది. ‘మనసుకు నచ్చింది’తో దర్శకురాలిగా తన అదృష్టం పరీక్షించుకుంది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణ పరాభవాన్ని ఎదుర్కొంది. ‘ఇదేం సినిమారా బాబోయ్’ అంటూ తలలు పట్టుకుని థియేటర్ నుంచి బయటపడ్డారు జనాలు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే.. ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్రాలేదు. ఆ పేరు కనీసం ఓపెనింగ్స్ కూడా తీసుకురాలేకపోయాయి. అయినా సరే.. మంజుల ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పుడు తన రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు టాక్. దర్శకురాలిగా ఈసారి ఎలాగైనా నిరూపించుకోవాలన్న తపనతో.. మరో కథని సిద్ధం చేస్తోందట. ఈసారి తన సొంత నిర్మాణ సంస్థలోనే ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని సమాచారం. ఇందులో ఓ పేరు మోసిన యువ హీరో కథానాయకుడిగా నటిస్తారని చెప్పుకుంటున్నారు. ‘మనసుకు నచ్చింది’ నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్లకు వినిపించింది మంజుల. కానీ వాళ్లు ‘నో’ అన్నారు. ఇప్పుడు ఈ కొత్త కథకు ఎవరు ‘ఎస్’ అంటారో చూడాలి.