ఇప్పటివరకూ మహేశ్‌బాబు ఒక్క రీమేక్ సినిమా చేయలేదు. సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ‘3 ఇడియట్స్’ రీమేక్ ప్రదిపాదనతో వస్తే తిరస్కరించాడు. పరాయి భాషలో హిట్టయిన సినిమా రీమేక్‌లో నటించడం ఇష్టం లేదని చెప్పే మహేశ్, తండ్రి సినిమాలను అసలు టచ్ చేయనని చెబుతుంటాడు. ఇప్పుడు సిస్టర్ మంజుల కోసం ఓకే అంటాడేమో చూడాలి. మహేశ్‌తో ఒక సినిమా చేయాలని ప్లానింగ్‌లో వున్నానని మంజుల కన్ఫర్మ్ చేశారు. దాంతో పాటు ప్రేక్షకులకు చిన్న పజిల్ కూడా ఇచ్చారు. “నాన్నగారు తప్ప ఎవరూ చేయనటువంటి కొత్త కథలో, కొత్త పాత్రలో మహేశ్‌ను చూపించబోతున్నా. మహేశ్‌తో నేను చేయబోయే సినిమా నాన్నగారి సినిమాకు రీమేకా? స్ట్రెయిట్ సినిమానా? అనేది ఇప్పుడు చెప్పను. త్వరలో ఆ సినిమా వివరాలు వెల్లడిస్తా” అని మేటర్ అంతటితో క్లోజ్ చేశారు. మొన్నటివరకూ మీడియా ముందుకు వచ్చినప్పుడు “మహేశ్‌తో సినిమా చేయాలనుంది. ‘మనసుకు నచ్చింది’ చూసిన తర్వాత మహేశ్ పిలిచి మరీ నాతో సినిమా చేయమని అడుగుతాడు” అని చెప్పేవారు. లేటెస్ట్గా మహేశ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాని చెప్పారు. అక్కకు తమ్ముడు ఛాన్స్ ఇస్తాడంటారా? వెయిట్ అండ్ సీ!!