రాజకీయాలు అంటే ఎక్కువగా మాట్లాడేవారే ఉన్నత స్థానానికి వెళ్తారని అనుకుంటారు. కానీ మన్మోహన్ సింగ్ అసలు మాట్లాడరు. ఆయన ఎక్కువగా వింటారు. చాలా తక్కువగా మాట్లాడతారు. పదేళ్ల పాటు ప్రధానిగా చేసిన ఆయన హయాంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అయితే ఆయన పనితనం అక్కడ నుంచే ప్రారంభం కాలేదు. దేశం దివాలా స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన ఆర్థిక నైపుణ్యంతో గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయానికి భారత్ వద్ద విదేశీ మారకద్రవ్యం చాలా తక్కువగా ఉంది.దిగుమతులకు ఇబ్బందిపడాల్సిన పరిస్థితుల్లో.. బంగారాన్ని ప్రత్యేకంగా విమానంలో లండన్ తరలించి తాకట్టు పెట్టి బయటపడాల్సి వచ్చింది. ఇప్పుడు దేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తోంది. దివాలా స్థితి నుంచి ఇలా ముందడుగు వేయడానికి కారణం ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ విధానాలే.
ప్రజాజీవితంలో లేకపోయినా మన్మోహన్ సింగ్ అయితేనే దేశాన్ని గాడిలో పెట్టగలరని పీవీ ఆయనను అర్థిక మంత్రిగా చేశారు. ఆయనతో బాధ్యతను వంద శాతం పక్కాగా నిర్వహించారు. ఫలితంగా దేశం ముందడుగు వేసింది. తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు సోనియా ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత సమర్థత పరంగాఆయనే ముందు వరుసలో నిలిచారు. ప్రధాని అయ్యారు. పదేళ్ల పాటు మౌనంగానే దేశానికి సేవ చేశారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన గొప్పగా విజయాలు సాధించలేకపోవచ్చు కానీ ఆయన దేశానికి చేసిన మేలు మాత్రం ఎవరూ మర్చిపోలేరు. 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన మన్మోహన్ సింగ్ ముద్ర దేశ ఆర్థిక ప్రయాణంలో ప్రతి అడుగులో కనిపిస్తుంది.