17 బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్లు బాకీలు చెల్లించకుండా లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకి బ్యాంకులు అంత పెద్ద మొత్తాలు అప్పులు ఇచ్చాయంటే ఆయనకంటే చాలా పెద్దవారు ఎవరో ఒకరు ఆయనకి ష్యూరిటీ ఇచ్చే ఉండాలి. ఆయన మరెవరో కాదు మన్మోహన్ సింగ్! షాక్ అయ్యారా? అయితే మరో షాక్ కి కూడా సిద్ధంకండి. ఆయన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కాదు. అదే పేరుగల ఒక సామాన్య రైతు! అతను ఉత్తరప్రదేశ్ లో ఫిలిబిత్ జిల్లాలో ఖజురియా నవీరాం అనే గ్రామంలో నివసిస్తున్నారు. అతనికున్న 8 ఎకరాల పొలం మీదనే ఆయన కుటుంబం బ్రతుకుతోంది. ఆయనకి రెండు బ్యాంక్ ఖాతాలున్నాయి. ఏనాడు పైసా కూడా బ్యాంక్ ఋణం ఎగవేయలేదని ఆ బ్యాంకులే చెపుతున్నాయి. కానీ అకస్మాత్తుగా ముంబైలోని ఆ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి మన్మోహన్ సింగ్ ఖాతాలను తక్షణమే నిలిపి వేయాలని, ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వవద్దని ఆదేశాలు రావడంతో ఆ రెండు బ్యాంకులు ఆయన ఖాతాలను నిలిపివేశాయి. ఇంతకీ దానికి కారణం ఏమిటంటే ఆయన కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకి ష్యూరిటీ ఇచ్చేరుట! మాల్యా బాకీలు చెల్లించకుండా పారిపోవడంతో ఆయనకు ష్యూరిటీ ఇచ్చినందుకు మన్మోహన్ సింగ్ బ్యాంక్ ఖాతాలు నిలిపివేయమని ఆదేశాలు జారీ అయ్యేయి. ఆ కారణంగా అతనికి పిలిబిత్ లో ఇతర బ్యాంకులు కూడా కొత్తగా ఖాతా తెరవడానికి అనుమతించడం లేదు! విచిత్రంగా లేదూ?
మన్మోహన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఆ విజయ మాల్యా ఎవరో తెలియదు. ఏనాడూ నేను ఆయన పేరు కూడా వినలేదు. నా జీవితంలో ఎన్నడూ ముంబైకి వెళ్ళలేదు. మరి నేను ఆయనకి ష్యూరిటీ ఇవ్వడం ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. ఇదేలాగ సాధ్యమో, ఎలాగ జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు బ్యాంకులు నాకు అప్పు ఇవ్వడం లేదు. ఆ కారణంగా మొన్న నా గోధుమ పంటని అతితక్కువ ధరకే అమ్మేసుకోవలసి వచ్చింది. నాకు బ్యాంకులు అప్పు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పధకాలను పొందలేకపోతున్నాను. నా పరిస్థితి గురించి ఆ బ్యాంకు అధికారులకి మోర పెట్టుకొన్నా వాళ్ళూ తామేమీ చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నా గురించి వాళ్ళు ముంబైకి లేఖలు వ్రాశామని చెపుతున్నారు. కానీ ఇంతవరకు నా బ్యాంక్ ఖాతాలను నన్ను వాడుకోనీయడం లేదు,” అని వాపోయారు. రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ మాల్యాని ఏమీ చేయలేకపోతున్న బ్యాంకులు తమ ప్రతాపాన్ని సామాన్య రైతుపై చూపుతున్నాయి.