పారిశ్రామిక ప్రపంచంలో హైదరాబాద్ పేరు మరోసారి ఘనంగా మార్మోగింది. నగర శివార్లలలోని ఆదిభట్లలో టాటా, బోయింగ్ అతిపెద్ద కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. టాటా బోయింగ్ ఎయిరోస్పేస్ లిమిటెడ్ అని దీనికి పేరుపెట్టారు. బోయింగ్ ఎ.హెచ్. 64 ఆపాచే హెలిపాక్టర్లకు కీలకమైన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తారు.
పారిశ్రామిక రంగంలోనే కాదు, విమానయాన రంగంలోనూ హైదరాబాద్ కు మరింత కీర్తిని తెచ్చిపెట్టే ప్రాజెక్టు ఇది. ఈ హెలికాప్టర్లను భారత్, అమెరికా సహా అనేక దేశాలు ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఈ యూనిట్ నిర్మాణం పూర్తయితే ఇక్కడ నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంటుందన్న మాట.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు మేకిన్ ఇండియాలో భాగంగా ఈ మెగా ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తోంది. ఐటీ రంగమే కాదు, వివిధ రంగాల్లోనూ హైదరాబాదుకు బడా కంపెనీలు రావాలనే ఉద్దేశంతో పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. అనుమతుల మంజూరు ప్రక్రియను సరళీకరించారు. అందుకే, ఈ విధానం బాగుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మెచ్చుకున్నారు.
ఐటీ రంగంలో ఇప్పటికే హైదరాబాద్ ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు 75 వేల కోట్ల రూపాయలకు చేరాయి. గూగుల్, యాపిల్, అమేజాన్ వంటి బడా కంపెనీలు ఇక్కడ అతిపెద్ద సెంటర్లను తెరవబోతున్నాయి.
హైదరాబాద్ లో కొత్త కంపెనీలు పెరిగేకొద్దీ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక్క ఐటీ రంగం ద్వారానే 10 లక్షల మందికిపైగా ఉపాధి పొందారు. టాటా బోయింగ్ కేంద్రం శంకుస్థాపన అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంది. మరిన్ని ఎయిరో స్పేస్ సంస్థలు హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.