న్యాయ వ్యవస్థపై రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ తీవ్ర విమర్శలు చేశారు. డీజిల్ వాహనాల వలన వాయు కాలుష్యం పెరుగుతుందంటూ వాటిపై నిషేధం విధించడం అర్ధరహితం. దాని వలన మెర్సిడీస్ కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టకూడదని నిర్ణయించుకొంది. కాలుష్యానికి కారణమవుతున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చు కానీ ఆ సాకుతో అన్ని డీజిల్ వాహనాలను నిషేధం విధించాలనుకోవడం అర్ధ రహితం. అసలు డీజిల్ వాహనాలన్నిటినీ నిషేధించాలనే న్యాయస్థానం అభిప్రాయం వెనుక తర్కం అర్ధం చేసుకోలేకపోతున్నాను. సైన్స్ గురించి తెలియని వాళ్ళు దాని గురించి మాట్లాడటం సరికాదు,” అని అన్నారు.
దేశరాజధాని డిల్లీలో విపరీతంగా కాలుష్యం పెరిగిపోతోందని కేజ్రీవాల్ ప్రభుత్వం సరిబేసి నెంబర్ల వాహనాల విధానాన్ని కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూశారు. దాని వలన డిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు పడినప్పటికీ, అది ఒక మంచి ఉద్దేశ్యంతో చేస్తున్న ప్రయత్నమ గనుక అందరూ సహకరించారు. దాని వలన ఆశించిన స్థాయిలో వాయు కాలుష్యం తగ్గకపోయినా, రోజూ కొన్ని వేల వాహనాలు రోడ్ల మీదకి రాకుండా అడ్డుకోవడం వలన ఎంతో కొంత కాలుష్యం తగ్గే ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ డీజిల్ వాహనాల వలననే వాయు కాలుష్యం ఏర్పడుతోందనే ఉద్దేశ్యంతో సుప్రీం కోర్టు డిల్లీలో డీజిల్ వాహనాలు తిరగడాన్ని నిషేధం విధించడాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఎందుకంటే ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలలో ఉపయోగించే వాహనాలలో అధిక శాతం డీజిల్ నే ఇంధనంగా ఉపయోగిస్తుంటాయి. కనుక డిల్లీలో కేవలం పెట్రోల్ వాహనాలకే అనుమతిస్తామంటే అన్ని వర్గాల వారికీ ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే మనోహర్ పార్రికర్ స్పందించవలసి వచ్చింది. వాయు కాలుష్యం సమస్య కేవలం డిల్లీలోనే కాక దేశంలో అన్ని నగరాలు, పట్టణాలలో కూడా నానాటికీ పెరిగిపోతోంది. దానికి డీజిల్ వాహనాలే కారణం అని నిషేధిస్తే పరిస్తులు ఏవిధంగా తయారవుతాయో ఊహించవచ్చు. అన్ని రకాల కాలుష్యాలని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా కాలుష్య నియంత్రణ మండలి శాఖలున్నాయి. అవి కాలుష్య నివారణకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వగల అర్హత, అధికారం కలిగి ఉన్నాయి. వాటిని పాటించనివారిపై కటిన చర్యలు తీసుకొనే అధికారం కూడా కలిగి ఉన్నాయి. కానీ వాటిపని అవి సక్రమంగా చేయకపోవడం వలననే దేశంలో నానాటికీ ఈ కాలుష్య సమస్య తీవ్రమవుతోంది. అవి పనిచేయక పోవడం వలననే న్యాయవ్యవస్థలు జోక్యం చేసుకోవలసి వస్తోంది. న్యాయ వ్యవస్థపై ప్రభుత్వ ప్రతినిధులు విమర్శలు చేయవలసి వస్తోంది. కనీసం ఇప్పటికైనా కాలుష్య నివారణ మండలి మేల్కొని తగిన విధంగా స్పందిస్తే బాగుంటుంది.