రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. కొద్ది రోజులుగా.. కాంగ్రెస్ పార్టీ ఓ ఆరోపణ చేస్తోంది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్.. నరేంద్రమోడీ, అమిత్ షాలకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని… అందుకే ఆయనను పదవి నుంచి తప్పించడం లేదని ఆరోపిస్తోంది. మనోహర్ పారీకర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఎలాంటి ఆహారపదార్ధాలను నేరుగా నోటి ద్వారా తీసుకునే పరిస్థితిలో లేరు. అందుకే ముక్కుకు ట్యూబ్తోనే పదవిలో కొనసాగుతున్నారు. కొన్నాళ్ల క్రితం .. అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్నా.. గోవా ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులను తొలగించారు. కానీ.. మనోహర్ పారీకర్ జోలికి వెళ్లలేదు. పారీకర్ నెలల తరబడి మంచానికి పరిమితమయ్యారు. గతంలో పారీకర్ రక్షణ మంత్రిగా ఉండేవారు. అప్పుడే రాఫెల్ డీల్ జరిగింది.
ఇప్పుడు ఈ రాఫెల్ డీల్ ఫైల్స్.. మనోహర్ పారీకర్ వద్ద ఉన్నాయని.. వాటిని బయటపెట్టకుండా బ్లాక్ మెయిల్ చేస్తూ.. పారీకర్ పదవిని కాపాడుకుంటున్నారంటూ… తమ ఆరోపణలకు సాక్ష్యంగా..కాంగ్రెస్ ఓ ఆడియో టేపును బయటపెట్టింది. గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణె, ఒక అగంతకునితో మాట్లాడుతున్న ఆడియో టేపుని ఏకంగా లోక్సభలో వినిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం అంగీకరించలేదు. కనీసం ఆ టేపులో ఏముందో చెప్పేందుకు అంగీకరించాలని కోరిన స్పీకర్ ఒప్పుకోలేదు. రూల్స్ ఒప్పుకోవన్నారు. అయితే.. అదే సమయంలో.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాహుల్కు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి అబద్దాలు చెప్పే అలవాటుందన్నారు. రాహుల్కు ఏమీ తెలియదంటూ… విమర్శలు చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
మరో వైపు రాఫేల్ పై కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆడియో టేపు అభూత కల్పన అని గోవా సీఎం మనోహర్ పారికర్ ఓ ట్వీట్ చేశారు. మొత్తానికి రాఫెల్ వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా మోడీ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్యూలో… బడాబాబులు.. పరుపుల కింద దాచుకున్న నోట్ల కట్టలను బ్యాంకులకు తీసుకు రావడానికే.. తాను నోట్ల రద్దు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు.. మనోహర్ పారీకర్ పరుపు కింద ఉన్న… రాఫెల్ ఫైళ్లను బయటకు తీసుకు రావడానికి… ఏ ప్రయోగం చేస్తారో మరి..!