గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం ఢిల్లీ ఎయిమ్స్ లో ఆ తర్వాత అమెరికా ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చారు. ఇటీవలి కాలంలో ఆయన డిశ్చార్జ్ అయ్యారని.. విధులు నిర్వహిస్తున్నారని కూడా.. బీజేపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అలా విధులు నిర్వహిస్తున్నఫోటోలు గోవా ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. గోవాలో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఆ ఫోటోలను పెట్టుకుని భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా… చాలా గొప్పగా ప్రచారం ప్రారంభించింది. ప్రాణాలను పణంగా పెట్టి మరీ విధులు నిర్వహిస్తున్నారని.. బీజేపీ నేతల అంకిత భావం అదేననేది దానర్థం. కానీ కాసేపటికే విమర్శలు ప్రారంభమయ్యాయి. కారణంగా.. మనోహర్ పారీకర్ ముక్కులో ట్యూబ్ ఉంది. ఆయన నేరుగా ఆహారం కానీ.. మందులు కానీ తీసుకునే పరిస్థితిలో లేరు. ఆయన ఆ ట్యూబ్ ద్వారానే ఆహారం, మందులు ఇస్తున్నారు.
అంత తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. మనోహర్ పారీకర్ ను.. బీజేపీ అగ్రనాయకత్వం..పదవిలో కొనసాగిస్తూ…రాజకీయ లాభం కోసం వ్యక్తిగత హింసకు పాల్పడుతోందన్న విమర్శలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తాయి. జమ్మూకశ్మీర్ నేత ఓమర్ అబ్దుల్లా..” ఎంత అమానుషం.. పూర్తిగా కోలుకొని మనిషిని బాధ్యతలు నిర్వహించమని, ఫోటోలకు ఫోజులివ్వమని ఒత్తిడి చేయడం దారుణమంటూ” ట్వీట్ చేశారు. ఇది వైరల్ అయిపోయింది. కాంగ్రెస్ కూడా… ఓ వ్యక్తి అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాధ్యతలు నిర్వహించమని కోరే పార్టీ ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిజానికి పారీకర్ అనారోగ్యానికి గురైన తర్వాత .. అసలు కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు.. ఇద్దరు మంత్రుల్ని తొలగించారు. దానికి బీజేపీ హైకమాండ్ చెప్పిన కారణం .. అనారోగ్యం. కానీ పారీకర్ అంత తీవ్ర అనారోగ్యంతో ఉన్నా ఆయనను కొనసాగిస్తున్నారు. దీనికి కారణం.. పారీకర్ ముఖ్యమంత్రిగా లేకపోతే.. బీజేపీ చేతుల నుంచి.. గోవా జారిపోయే ప్రమాదం ఉండటమే.
పారీకర్ రక్షణమంత్రిగా ఉన్నప్పుడు గోవా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ఇండిపెండెంట్లతో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆకర్షించి.. మనోహర్ పారీకర్ ను ముఖ్యమంత్రిగా పంపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత పారీకర్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్నుంచి ఆయన కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇలా ఫోటోలు విడుదల చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ.. పారీకర్ చేస్తున్నది.. ప్రాణాలకు తెగించి మరీ ప్రజాసేవనా..? లేక బీజేపీ రాజకీయ అవసరాల కోసం.. అనారోగ్యంతో ఉన్న నేతను వేధించడమా..?.