మంచు ఫ్యామిలీ డ్రామా ఈ సారి ఏపీకి షిప్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మంచు మోహన్ బాబు సుప్రీంకోర్టులో లభించిన రిలీఫ్‌తో బయటకు వచ్చి.. తిరుపతి సమీపంలోని తన విద్యా సంస్థల్లో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. అక్కడ ఆయనతో పాటు మంచు విష్ణు చంద్రబాబు,లోకేష్ ల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి …. మేం..మేం ఫ్రెండ్స్ అన్న ఫీలింగ్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో పాటు మంచు మనోజ్ కనిపించలేదు. హైదరాబాద్ జల్ పల్లి నివాసంలో ఆయన పండుగ చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు.
అయితే అది సంక్రాంతి వరకే.. కనుమ పండుగ రోజు ఆయన ఎంబీయూనివర్శిటీకి వస్తున్నానని సమాచారం పంపారు. రంగంపేటలో సంక్రాంతి సందర్భంగా జల్లి కట్టు వేడుకలు జరుగుతాయి. ఆ గ్రామానికి మనోజ్ వెళ్లనున్నారు. అక్కడ వేడుకలను చూసిన తర్వాత మోహన్ బాబు యూనివర్శిటీకి వెళతారు. దీంతో మోహన్ బాబు వర్గం అలర్ట్ అయింది. ఆయనను విద్యాసంస్థల్లోకి అడుగు పెట్టనివ్వకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
విద్యాసంస్థల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని.. ఈ సంస్థను మేనేజ్ చేస్తున్న వినయ్ మహేశ్వరిపై మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ గొడవే పెరిగి పెద్దదయిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ రాక విషయం టెన్షన్స్ రేపుతున్నాయి. మనోజ్ రాక విషయంలో పోలీసులకు ఎంబీయూ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన వస్తే ఉద్రిక్తత ఏర్పడుతుందని.. రాకుండా చూడాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే మంచు మనోజ్ ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.