త్రిష విషయంలో తేనె తుట్టెను కదిపాడు మన్సూర్ అలీఖాన్. సినిమాల్లోనే కాదు, తను నిజ జీవితంలోనూ విలనే అనే టైపులో వ్యవహరిస్తున్నాడు. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించానని, అయితే తనని రేప్ చేసే సీన్ లేదని బాధ పడ్డానని, త్రిషని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాలనుకొన్నానని ఇలా.. చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు ఓ ఇంటర్వ్యూలో. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకొన్న త్రిష మన్సూర్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు మానవవాళికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసింది. జాతీయ మహిళా కమీషన్ సైతం రంగంలోకి దిగి.. మన్సూర్ పై చర్యలు తీసుకోవాలని డీపీజీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మన్సూర్ పై పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. మన్సూర్‌పై తమిళ చిత్రసీమ కూడా సీరియస్ అయ్యింది. త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే నిషేధాన్ని విధించాల్సివస్తుందని హెచ్చరించింది.
అయినా.. మన్సూర్ ప్రవర్తనలో కానీ, తన మాటల్లో కానీ ఎలాంటి మార్పూ రాలేదు. ఈరోజు చెన్నైలో ఓ ప్రెస్ మీట్ పెట్టాడు మన్సూర్. మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తేలేదని, తాను మాట్లాడిన మాటల్లో ఏమాత్రం తప్పు లేదని, తనని ప్రశ్నించడానికి నడిగర్ సంఘం ఎవరని, తనని సంప్రదించకుండా, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా తనని బహిరంగ క్షమాపణలు చెప్పమనడంలో అర్థం లేదని స్పష్టం చేశాడు. తిరిగి నడిగార్ సంఘమే తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అంతే కాదు.. మీడియాపై కూడా విరుచుకుపడ్డాడు. మీడియా ఏం రాసుకొన్నా తాను పట్టించుకోనని, ఇలాంటి ఇష్యూతో నేషనల్ హీరోగా తనని మార్చేశారని, ఫొటోలు మాత్రం బాగా వాడాలని ఎటకారం చేశాడు. పైగా త్రిష ఫొటో పక్కనే తన ఫొటో పెట్టడం వల్ల ఇద్దరూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్లుగా కనిపిస్తున్నామంటూ మరింత వేళాకోళమాడాడు. ఈ విషయంలో తనని మరింత రెచ్చగొడితే అణుబాంబులా పేలతానని, ఇది అందరికీ ప్రమాదమే అని హెచ్చరించాడు. మొత్తానికి త్రిష విషయంలో మన్సూర్ తగ్గే ప్రసక్తే లేదని తాజా కామెంట్ల ద్వారా అర్థమైపోతోంది. మరి నడిగార్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకొంటుందో చూడాలి.