త్రిష – మన్సూర్ అలీఖాన్ వివాదం ముగిసినట్టే ముగిసి.. ఇప్పుడు కొత్త రూపం సంతరించుకోబోతోందా? మన్సూర్ అలీఖాన్ చేష్టలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ‘లియోలో త్రిషను రేప్ చేసే సీన్ ఉంటే బాగుణ్ణు అనిపించింది’ అంటూ అనాలోచిత, అసభ్యకరమైన కామెంట్లు చేసి అందరి దృష్టిలో అప్రతిష్ట పాలైన మన్సూర్ అలీఖాన్, చివరికి తన తప్పు తెలుసుకొని రెండు రోజుల క్రితమే త్రిషకు ‘సారీ’ చెప్పాడు. దాంతో అంతా అయిపోయిందనుకొన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తన వివాదాన్ని తానే కెలుక్కొంటున్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకొన్న చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేస్తానని మరో తింగరి స్టేట్మెంట్ ఇచ్చాడు.
త్రిష వివాదం బాగా ముదిరిన తరుణంలో త్రిషకు మద్దతుగా చిరు, ఖుష్బూ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రిషని వదిలేసిన మన్సూర్ చిరు, ఖుష్బూలపై పడ్డాడు. తానెప్పుడో మాట్లాడిన విషయాల్ని ఎడిట్ చేసి, వైరల్ చేశారని, అది చూసి నిజానిజాల్ని తెలుసుకోకుండా అందరి దృష్టిలో తనని చులకన చేశారని, తన పరువుకి భంగం కలిగించారని, చిరు, ఖుష్బూల వల్ల తను అశాంతికి, మానసిక ఆందోళనకు గురయ్యానని మన్సూర్ ఆరోపిస్తున్నాడు. మన్సూర్ అలీఖాన్ చేష్టలు మరీ తింగరితనంగా ఉన్నాయి. నిజంగానే.. తనలోని విలన్ కోణం ఇప్పుడు బయటపడుతోంది. త్రిష విషయంలో మన్సూర్ చేసిన వ్యాఖ్యల్ని సిల్లిగా తీసుకొన్నవాళ్లు కూడా ఇప్పుడు ఈ పరువు నష్టం విషయం తెలిసి.. మన్సూర్‌ని ఓ రేంజ్లో ఆడుకొంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ రీ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, అవకాశాలు అందుకొంటున్న మన్సూర్ కెరీర్‌కి ఇది శరాఘాతమే. పైగా.. త్వరలో రాజకీయాల్లోకి వెళ్లాలనుకొంటున్నాడట. ఈ ఇమేజ్‌తో పాలిటిక్స్‌లో అడుగుపెడితే.. డిపాజిట్లు కూడా దక్కవు. మరి మన్సూర్ ఇదంతా తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో, తెలివితక్కువతనంతో చేస్తున్నాడో..?