ఇతర రాష్ట్రాల్లో ఉన్న శ్రీవారి ఆస్తులను .. కాపాడుకోలేక అమ్మాలని టీటీడీ ప్రయత్నించింది. కానీ తీవ్రమైన వివాదం రేగడంతో ఆగిపోయింది. ఇప్పుడు అలాంటి వివాదం.. కర్నూలు జిల్లాలోని రాఘవేంద్రస్వామి మఠం భూముల అమ్మకంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రసిద్ధి చెందిన రాఘవేంద్ర స్వామి మఠానికి తెలంగాణలోని గద్వాల జిల్లాలో 208 ఎకరాల భూములున్నాయి. వాటిని కాపాడుకోలేపోతున్నామని చెబుతూ.. అమ్మాలని నిర్ణయించారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. దానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో వేలానికి ముహుర్తం సిద్ధం చేశారు.
మంత్రాలయం మఠానికి మొత్తంగా 5,192 ఎకరాల భూములు ఉన్నాయి. తెలంగాణలో 1,873 ఎకరాలు ఉంన్నాయి. చాలా మంది కౌలు చెల్లించడం లేదని.. కొంత మంది ఆక్రమించి పట్టాలు పుట్టించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఇబ్బందులన్నీ ఎందుకని భూమల్ని అమ్మాలని మఠం నిర్ణయించింది. అలాగే.. కర్నూలు జిల్లా కౌతాళంలోనూ 251 ఎకరాల భూమిని అమ్మాలని నిర్ణయించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పవిత్రమైన ఆలయం భూములు అమ్మితే ఊరుకునేది లేదని ఇప్పటికీ బీజేపీ నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపించారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు ఏపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
నిజానికి మంత్రాలయం భూముల అమ్మకం ప్రతిపాదన ఇప్పటిది కాదు. మూడేళ్ల కిందటిదే. అప్పటి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు కానీ.. అనుమతి లభించలేదు. ఇప్పుడు అనుమతి లభించలేదు. కౌలు రావడం లేదని.. అమ్మితే కోట్లు వస్తాయని.. వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆలయానికి ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అయితే ఆలయ భూములంటే.. భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నాయి. అంతకు మించి ఇప్పుడు రాజకీయంతో కలిసిపోతున్నాయి. టీడీపీ హయాంలో.. అసలు డాక్యుమెంట్లే లేని.. పూర్తిగా ఆక్రమణకు గురైన సదావర్తి భూముల్ని వేలం వేస్తే అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి ఆ వేలాన్ని ఎటూ కాకుండా ఆపేశారు. అదే దారిలో ఇప్పటి ప్రతిపక్షాలు నడవవన్న గ్యారంటీ లేదు. తిరుమల విషయంలో అదే జరిగింది. మంత్రాలయం విషయంలోనూ అదే జరిగే అవకాశం ఉంది.