Manu charitra movie review
రేటింగ్: 1.5/5
చూసీ చూడంగానే, గమనం.. తదితర చిత్రాలలో ఆకట్టుకున్నాడు శివ కందుకూరి. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలు సాఫ్ట్ నేచర్ లో వున్నవే. ‘మనుచరిత్ర’ ప్రచార చిత్రాలలో మాత్రం మాస్ కోణం కూడా కనిపించింది. భరత్ పెదగాని అనే కొత్త దర్శకుడు తీసిన సినిమా ఇది. మనుచరిత్ర నటుడిగా తనని మరో మెట్టు ఎక్కుస్తుందని నమ్మకంగా చెప్పాడు శివ. తొలిసారి తన కంఫర్ట్ జోన్ దాటి చేసిన ఈ సినిమా ఎలా ఫలితాన్ని ఇచ్చింది? ప్రేమ, గూండాయిజం నేపధ్యంలో సాగిన మనుచరిత్ర ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?
మను (శివకందుకూరి) వరంగల్ కుర్రాడు. తను చదువుల్లో టాప్. ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన మను కి జెన్ని ఫర్( మేఘా ఆకాష్) ఎదురౌతుంది. తొలి చూపులోనే జెన్నీ ప్రేమలో పడిపోతాడు. జన్నీ కోసం ఎన్ఐటి కాలికట్లో సీట్ వదులుకొని ఆమె చదువుతున్న కాలేజ్ కి వచ్చేస్తాడు. మను ప్రేమని చూసి మురిసిపోతుంది జెన్నీ. ఉంగరాలు కూడా మార్చుకుంటారు. ఇంట్లో పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా ఓ సంఘటన వారి జీవితాల్ని మార్చేస్తుంది. జెన్నీ వేరే వాడిని పెళ్లి చేసుకొని దేశం విడివి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరిగింది ? జన్నీ ప్రేమని మను మర్చిపోగలిగాడా? మర్చిపోవడానికి ఎలాంటి దారులు వెదికాడు? స్థానిక గూండ రుద్ర (డాలి ధనంజయ)తో కలసి ఎలాంటి పనులు చేశాడు? చివరికి మను జీవితం ఏమైయిందనేది కథ.
ఈ సినిమా చివర్లో ‘ప్రేమ చేసిన గాయానికి మందు ప్రేమ మాత్రమే’ అని అర్ధం వచ్చే ఓ డైలాగ్ ప్రకాష్ రాజ్ వాయిస్ తో వినిపిస్తుంది. దర్శకుడు ఆలోచన కూడా ఇదే కావచ్చు. తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడానికి, ఆమె ప్రేమని మరో అమ్మాయిలో వెతుక్కునే ఓ కుర్రాడి కథ ఇది. ఇలాంటి కథకు అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 టైపు కోటింగ్ ఇచ్చి గూండాయిజం తగిలించేస్తే కొత్తగా ఉంటుందనే ఆలోచన దర్శకుడిది కావచ్చు. అయితే ఈ కథని చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న విధానం మాత్రం దెబ్బకొట్టేసింది. అటు ప్రేమ కథ, ఇటు గూండాయిజం.. దేనికి న్యాయం చేలకపోయిందీ సినిమా.
ఈ ప్రేమకథని ఓ మర్డర్ సీన్ తో మొదలుపెట్టాడు దర్శకుడు. ఓ వ్యక్తిని ఇనుప గోలుసులతో ఓ పెద్ద రాయికి కట్టేసి ఓ చెరువులో పడేస్తారు. తర్వాత అదే చెరువులో అదే తరహలో చాలా శవాలు నీటి మధ్యలో తేలుతూ కనిపిస్తాయి. కొత్త దర్శకుడు భలే తీసేశాడే.. అనే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత హీరో ఎంట్రీ కూడా బాగానే ప్లాన్ చేశాడు. ఒక మాస్ ఫైట్ సీన్ .. ఓకే అనిపిస్తుంది. ఐతే అసలు కథ మొదలైన తర్వాతే ఇబ్బంది ఎదురౌతుంది. ఓ అమ్మాయిని చూడటం.. ఆమెతో ఐ లవ్ యూ చెప్పించుకోవడం.. తర్వాత బ్రేక్ అప్ చెప్పడం.. ఇదే తంతుని సాగదీశారు. హీరోకి ఒక గతం వుందనే సంగతి అందరికీ అర్ధమౌతుంటుంది. ఆ గతంలోకి వెళ్ళడానికే చాలా సమయం తీసుకున్నారు. దీంతో అదంతా బోరింగ్ వ్యవహారంలా మారిపోతుంది.
ఇలాంటి ప్రేమకథలో నిజాయితీ, ఎమోషన్.. రెండూ చాలా సహజంగా వుండాలి. కానీ జన్నిఫర్ తో నడిపిన లవ్ ట్రాక్ లో సహజంత్వం వుండదు. తొలిచూపులో ప్రేమించడాలు, అమ్మాయి కోసం కాలేజ్ మారడాలు, కొత్తబంగారం సినిమా టైపులో కాలేజ్ లో పరిచయాలు ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు. ఆ పాత సీన్లని మళ్ళీ వాడుకున్నట్టు అనిపిస్తుంది. పైగా ప్రేమకథలో సంఘర్షణ కూడా చాలా పాతది. తెలియక హీరోయిన్ తమ్ముడిని కొట్టడం, దాంతో హీరోయిన్ కుటుంబం అంతా రివర్స్ అయిపోవడం .. ఇలాంటి ట్రీట్మెంట్ ఇది వరకు కొన్ని సినిమాల్లో చుసేశాం.
ఇంటర్వెల్ వరకూ ఏదోలా నెట్టుకొచ్చారు గానీ సెకండ్ హాఫ్ లో నడపడానికి కథే వుండదు. ఫస్ట్ హాఫ్ లో చూపించిన సన్నివేశాల్ని ప్రేక్షకులు మర్చిపోయారేమోనని గుర్తు చేస్తూ.. అవే అవే సీన్స్ ని తిప్పితిప్పి చూపించారు. హీరో చేసే గూండాయిజం కూడా వింతగా వుంటుంది. ఆ గ్యాంగ్ లో గెస్ట్ గా ఉంటాడు తప్పితే ఎక్కడా ఇన్వాల్ మెంట్ వుండదు. ఎప్పుడో మర్చిపోయిన ఒక ఐడియా సడన్ గా గుర్తుకువచ్చినట్లు జాను అనే మరో పాత్రని ప్రవేశపెట్టి ఇంకో లవ్ స్టొరీ ని పట్టాలెక్కిస్తాడు దర్శకుడు. ఈ ప్రేమకథలో కూడా ఫీల్ వుండదు. ప్రేమ చేసిన గాయానికి మందు ప్రేమ అనే మాటని జస్టిఫికేషన్ చేయాలి కాబట్టి .. ఈ రెండో ప్రేమ కథ తీసుకొచ్చారు అనుకోవాలంతే. ఇందులో గూండాయిజం కూడా వుంది కాబట్టి .. చివర్లో ఓ యాక్షన్ సీన్ ని కండక్ట్ చేసి రొటీన్ ఎండ్ కార్డ్ పడేస్తారు.
శివ చూడడానికి బావున్నాడు. మను పాత్రని తన శక్తిమేరకు చేశాడు. ఐతే ఈ పాత్రకు తన ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు. మేఘా ఆకాష్ అందంగా వుంది. తన నటన బావుంది. జాను పాత్రలో చేసిన ప్రగతి క్యూట్ గా వుంది. ప్రియవడ్లమాని ఓకే అనిపిస్తుంది. ఇందులో సుహాస్ వున్నాడు కానీ తన పాత్రని చాలా రొటీన్ గా ట్రీట్ చేశారు. ఈ కథ తన వల్లే మలుపు తిరుగుతుంది కానీ ఆ మలుపులు మరీ సిల్లీగా వుంటాయి. చివర్లో రుద్ర చేతికి కావాలనే చిక్కే సీక్వెన్స్ మరీ పేలవంగా వచ్చింది. డాలీ దనంజయని పవర్ ఫుల్ గా చూపించారు కానీ చివర్లో ఆ పాత్రలో కూడా ఎనర్జీ వుండదు. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి.
టెక్నికల్ సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. గోపీసుందర్ అందించిన పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలా వుండవు. దాదాపు వరంగల్ లో తీసిన సినిమా ఇది. కెమెరాపనితనం మరీ అంత గొప్పగా వుండదు. డైలాగుల్లో, సీన్స్ లో లెంత్ లు చూసుకోలేదు. ప్రేమకి సంబధించిన డైలాగులైతే భీవత్సంగా వుంటాయి. ప్రతి పాత్ర ప్రేమ గురించి భారీ డైలాగులు చెబుతున్నా ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునేలా వుండదు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర దర్శకుడు చాదస్తం చూపించినట్లు వున్నాడు. తీసిన సీన్లు అన్నీ కావాలని పట్టుపడితే ఇలాంటి సాగదీత సినిమానే తయారౌతుంది. ఈ సినిమాలో దాదాపు నలఫై ఐదు నిముషాలు ఎత్తేసే వీలు పుష్కలంగా వుంది.
ప్రేమకథని డీల్ చేయడం అంత తేలికకాదు. కథ, పాత్రల మధ్య ఎమోషన్ తో మ్యాజిక్ క్రియేట్ చేయగలిగితేనే ఇలాంటివి తెరపై మెప్పిస్తాయి. అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయడంలో కొత్త దర్శకుడు విఫలమయ్యాడు.
రేటింగ్: 1.5/5