కథానాయికల మనసు విశాలమే అని కాజల్ మరోసారి నిరూపించింది. సాధారణంగా మేనేజర్ల విషయంలో కథానాయికలు పెద్ద మనసుతోనే వ్యవహరిస్తారు. సమంత, అనుష్క, త్రిష లాంటి స్టార్ హీరోయిన్లు మేనేజర్లని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్లని నిర్మాణ రంగంలోకీ తీసుకొస్తారు. ఇప్పుడు కాజల్ అదే చేసింది. గత కొన్నేళ్లుగా కాజల్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు జోసెఫ్. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారారు. అదీ కాజల్ ప్రోత్సాహంతోనే. `మనుచరిత్ర` అనే కొత్త సినిమా ఈరోజు పట్టాలెక్కింది. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటిస్తున్నాడు. మేఘా ఆకాష్ కథానాయిక. ఈ సినిమాకి జోసెఫ్ నిర్మాత. జోసెఫ్ కోసమే కాజల్ ఈ సినిమాని సమర్పకురాలిగా మారింది. ఈ సినిమా ప్రమోషన్లలో ఇక విరివిగా కాజల్ కనిపించడం ఖాయం. నిజానికి కాజల్‌లో ఓ సినిమా చేయాలని జోసెఫ్ అనుకున్నారు. కానీ… కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. కేవలం కాజల్ పేరుని బ్రాండ్ కోసమే వేసుకోలేదని, తను జోసెఫ్‌కి ఆర్థిక సహాయమూ అందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కథానాయికల్లో కొంతమంది నిర్మాణ రంగం వైపు దృష్టి పెడుతున్నారు. కాజల్నీ త్వరలో నిర్మాతగా చూడొచ్చన్నమాట.