కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం మునుగోడులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పటినుండో కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ర్యాంకింగ్ ప్రకారం మూడో స్థానం లో ఉన్న కాంగ్రెస్ నిలబెట్టుకోగలుగుతుందా, లేక సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ టికెట్ మీద కూడా గెలిచి మునుగోడులో ఇప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ వైభవం అంతా తన సొంత ప్రతిభ అని నిరూపించుకుంటారా, లేక అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది. గత కొద్ది వారాలుగా నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పర్యటించి తమ నివేదికను ఏఐసిసి ముందు ఉంచారు.
ఏఐసిసి నేతలైన ప్రియాంక గాంధీ , వేణుగోపాల్ తదితరులు ఈ నివేదికను కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేతల ముందు ఉంచినట్లు సమాచారం. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతానికి మునుగోడు నియోజకవర్గం లో మొదటి స్థానంలో టిఆర్ఎస్, రెండవ స్థానంలో కాంగ్రెస్, ఆ తర్వాత మూడవ స్థానంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్న టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా కూడా స్వల్పంగానే ఉందని ఈ నివేదిక పేర్కొంది. అయితే బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుని మొదటి స్థానానికి దూసుకు వచ్చే అవకాశం ఉందని కూడా నివేదిక పేర్కొంది. ఇక్కడ బిజెపికి పెద్దగా క్యాడర్ లేదని బిజెపికి అవకాశాలు ఏమాత్రం లేవని, పోటి ప్రధానంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ఉంటుందని ఈ నివేదిక తేల్చి చెప్పింది.
అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ బిజెపిని తక్కువగా అంచనా వేస్తోందని, ఎన్నికలు వచ్చేలోగా తన పార్టీకి హైప్ తీసుకుని వచ్చి ఫలితాలను తారుమారు చేయడంలో బిజెపి వ్యూహకర్తలు దిట్టలు అని విశ్లేషిస్తున్నారు.
ఏది ఏమైనా మునుగోడులో జరుగుతున్న రాజకీయ పోరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది అనడంలో సందేహం లేదు.