రాజకీయాల్లో సెమీఫైనల్స్.. ఫైనల్స్ ఉండవు. డైరక్ట్ ఎన్నికలే ఉంటాయి. అయితే రాజకీయ పార్టీలకు రాజకీయమే పని అయిపోయిన రోజుల్లో సెమీఫైనల్స్ పుట్టుకొస్తున్నాయి. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికను తెలంగాణ రాజకీయ పార్టీలు సెమీ ఫైనల్‌గా నిర్ణయించుకున్నాయి. గెలిచే పార్టీకి ఫైనల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓడిపోయే వారికి రాజకీయ భవిష్యత్ కూడా కష్టమవుతుంది. ప్రధానంగా ముగ్గురు నేతల రాజకీయ జీవన్మరణ పోరాటంగా ఇది మారిందని అనుకోవచ్చు.
మునుగోడు ఉపఎన్నిక కేసీఆర్‌కు అత్యంత కీలకం. మూడో సారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకు రావాలని అనుకుంటున్న కేసీఆర్ ఇక్కడ గెలిచి తీరాల్సిఉంది. ఈ ఉపఎన్నికలో పరాజయం పాలైతే అది పునాదుల్నే కదిలించేస్తుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఒక్క సారి మాత్రమే గెలిచింది. తెలంగాణ సెంటిమెంట్… అభివృద్ధి నినాదంతో కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. తేడా వస్తే బీజేపీ కమ్మేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తట్టుకోవడం కష్టమవుతుంది.
రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్‌గా ఇదే అసలైన పరీక్ష. మునుగోడు నియోజవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. నల్లగొండ పెద్దారెడ్లకు చెక్ పెట్టడానికి కూడా రేవంత్‌కు ఇది మంచి చాన్స్. టీ పీసీసీ చీఫ్‌గా నల్లగొండలో పర్యటనకు కూడా ఒప్పుకోని నేతలు ఉన్న జిల్లాలో ఆయన ఇప్పుడు తన ముద్ర చూపించే చాన్స్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను కాపాడుకుని… అందరిలో నమ్మకం కలిగిస్తే రేవంత్ కన్నా అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఇక్కడ గెలిస్తే తెలంగాణలో రేవంత్ క్రేజ్ పెరుగుతుంది. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అనే భావన పెరుగుతుంది. అది కాంగ్రెస్‌కు మేలు చేస్తుంది
తెలంగాణ రాజకీయాల్లో సెమీ ఫైనల్ తెచ్చి పెట్టింది బీజేపీ. మునుగోడులో గత ఎన్నికల్లో ఎప్పుడూ ప్రభావం చూపలేదు బీజేపీ. రాజగోపాల్ రెడ్డిని నమ్ముకునే బీజేపీ రంగంలోకి దిగుతోంది. దుబ్బాక, హుజురాబాద్ లెక్క వేరు మునుగోడు లెక్క వేరు. ఈటల పలుకుబడి వేరు.. రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ వేరు. అందుకే బీజేపీ నిర్ణయంపై కొంత మంది పెదవి విరుస్తున్నారు. బీజేపీ ఓడిపోతే.. మాత్రం బండి సంజయ్ ఇప్పటి వరకూ కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.