భారతీయ స్టేట్ బ్యాంకులో దాని అనుబంధ బ్యాంకులను కలిపేసిన భారతీయ రిజర్వు బ్యాంకు ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తొమ్మిది జాతీయ బ్యాంకులకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది. కార్పొరేషన్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను చాపచుట్టేయాలనుకుంటోంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం, సిండికేట్ బ్యాంక్, ఐఓబీ, యూకో బ్యాంకులు కెనరా బ్యాంకులో విలీనమవుతాయి. ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, విజయా బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ, యునైటెడ్ బ్యాంక్, పి అండ్ ఎస్ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలోనూ, ఐడీబీఐ, సెంట్రల్ బ్యాంక్, డేనా బ్యాంకులు యూనియన్ బ్యాంకులోనూ, ఓబీసీ, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ విలీనమవుతాయి.
దీనివల్ల బ్యాంకుల సంఖ్య తగ్గడమే కాక లావాదేవీలలో అవకతవకలను తేలిగ్గా అదుపు చేయవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెడుతున్న బిజినెస్ టైకూన్లతో ఎదురవుతున్న ఇబ్బందులను దీనిద్వారా అధిగమించవచ్చనేది దాని యోచన. బ్యాంకులను విలీనం చేసి, పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు కూడా లేకపోలేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఏమైనప్పటికీ, కరెన్సీ రద్దు నిర్ణయంతో ప్రకంపనలు సృష్టించిన ఎన్డీఏ సర్కారు బ్యాంకింగ్ రంగంలో మరో భూకంపానికి.. పెనుమార్పులకూ తెరలేపుతోంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి