సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయ్ జాన్’ సినిమా కారణంగా పాకిస్తాన్ నుంచి ‘గీత’స్వదేశానికి చేరుకోగలిగింది కానీ ఆమె భారత్ చేరుకొని పడి రోజులయినా ఇంతవరకు తన అసలయిన తల్లి తండ్రులను చేరుకోలేకపోయింది. బిహార్ కు చెందిన జనార్ధన్ మహతో గీత తమ కూతురేనని భావించారు. కానీ గీత ఆయనని తన తండ్రిగా గుర్తించలేకపోవడంతో వారిరువురి రక్త నమూనాలు సేకరించి డి.ఎన్.ఏ. పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు రావడానికి కనీసం మరొక వారం పది రోజులు పట్టవచ్చును. అంతవరకు గీతను మధ్యప్రదేశ్ లో ఇండోర్ పట్టణంలో గల మూగ చెవుడు బాలికల శిక్షణ, వసతి గృహంలో ఉంచారు.
ఖమ్మం జిల్లా నుండి దంపతులు, అలాగే ఉత్తరప్రదేశ్ లో ప్రతాప్ ఘర్ లో రాం కా పూర్వ అనే గ్రామానికి చెందిన దంపతులు, మరో రెండు మూడు రాష్ట్రాల నుండి కొందరు దంపతులు గీత తమ కూతురేనని భావిస్తున్నారు. వారిలో కొందరు విదేశాంగ శాఖకు తమకు డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించి గీత తమ కూతురు అని నిర్ధారణ అయితే ఆమెను తమకు అప్పగించాలని దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో ప్రతాప్ ఘర్ కి చెందిన రామరాజ్ గౌతం, అనరా దేవి దంపతులు గీత ఖచ్చితంగా చిన్నప్పుడు తప్పిపోయిన తమ కుమార్తె సవిత అని చెపుతున్నారు.
వారు జిల్లా కలెక్టర్ పి. నరహరిని కలిసి “నా బావమరిది ఒక సాధువు. ఆయన బిహార్ లోని చప్రా లో ఒక ఆశ్రమంలో ఉంటారు. మా పాపకున్న మూగ చెవుడు సమస్యలను ఆయన సరిచేస్తారనే నమ్మకంతో మేము మా పాపని ఆయన ఆశ్రమంలో వదిలి పెట్టి వచ్చేము. అప్పుడు ఆమె వయసు సుమారు 8 ఏళ్ళు. కొన్ని రోజుల తరువాత మా పాప ఆశ్రమం నుంచి ఏటో వెళ్లిపోయిందని తెలిసి పాప కోసం చాల చోట్ల వెతికాము కానీ ఆమె ఆచూకి దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత గీత రూపంలో మాముందు ప్రత్యక్షమయింది. ఆమె మా పాపేనని నిరూపించుకొనేందుకు మేమిద్దరం డి.ఎన్.ఏ. పరీక్షలు చేయించుకోవడానికి సిద్దం. ఒకవేళ ఆమె మమ్మల్ని తల్లి తండ్రులుగా గుర్తుపట్టలేకపోతే మేము మరో మాట మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోతాము,” అని చెప్పారు. వారు తమ వద్ద ఉన్న సవిత (గీత) చిన్నప్పటి ఫోటోను తెచ్చి చూపిస్తున్నారు. వారి దరఖాస్తును జిల్లా కలెక్టర్ పి. నరహరి విదేశాంగ శాఖకు పంపారు. అక్కడి నుంచి పిలుపు వస్తే వారిరువురినీ డిల్లీ పంపించి డి.ఎన్.ఏ. పరీక్షలు చేయిస్తామని తెలిపారు.
గీతకు ఇంతవరకు తల్లి తండ్రులను చేరుకోలేకపోవడం దురదృష్టమనుకొంటే, ఆమె కోసం దేశంలో ఇంతమంది తల్లి తండ్రులు తపించిపోతుండటం అదృష్టంగా భావించాలి. మరో విశేషం ఏమిటంటే ఆమె భారత్ చేరుకోవడానికి మూల కారణమయిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను త్వరలో కలుసుకోబోతోంది. ఈనెల 8-10 తేదీలలో ముంబైలో అమితాబ్ బచ్చన్ చేస్తున్న ఒక రియాలిటీ షో ‘ఆజ్ కీ రాత్ హై జిందగీ’ అనే కార్యక్రమంలో పాల్గొని సల్మాన్ ఖాన్‌ను కలుసుకొనేందుకు గీత ముంబై వస్తోంది. ఆమె తన అసలయిన తల్లి తండ్రులను చేరుకోనేవరకు బహుశః ఇటువంటి పెద్దపెద్ద నటులు, వి.ఐ.పి.లను కలుస్తూ ఆమె కూడా ఒక సెలబ్రిటీగా ఎదిగిపోతుందేమో?