2017, డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. 1975 లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు మొదలవగా, ఇప్పుడు జరుగుతున్నవి ఐదవ మహా సభలు. ఇప్పటిదాకా జరుగుతున్న సభలు భారీ గా , ఉత్సాహంగా జరుతున్నప్పటికీ తెలంగాణా సంస్కృతిని చాటడం లో, తెలంగాణా సాహితీ యోధులని ఈ తరానికి పరిచయం చేయటం లో విజయవంతమైనప్పటికీ, ఈ సభల విషయమై కొన్ని అభ్యంతరాలు, ప్రశ్నలు కూడా సంధించబడ్డాయి.
1. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ కుటుంబానికి ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం రాకపోవడంపై రావూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాకుడురాళ్లు లాంటి రచనలతో తెలుగు సాహితీవనాన్ని పరిమళింపజేసిన రావూరిని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోవడం పై రావూరి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సత్కరించినా, తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని, రాష్ట్రాలు వేరైనా భాష ఒక్కటేనని రావూరి కుమారుడు పేర్కొన్నారు.
2. తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల మహత్తర సేవలను ప్రపంచానికి చాటడం ఈ సభల ముఖ్యోద్దేశ్యం అని సభా నిర్వాహకులు విస్పష్టంగా ప్రకటించిన దరిమిలా ఆ కోణం లోనే రావూరిని విస్మరించి ఉండవచ్చని అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉపన్యాసం లో తెలంగాణా పాటని తలుచుకుని, సుద్దాల హనుమంతు, అశొక్ తేజ, గోరేటి వెంకన్న సహా ఎంతోమంది ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి , పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణా పాటని జజ్జనక ఆడించిన గద్దర్ పేరు తలవకపోవడం తెలంగాణా సాహితీ ప్రియులకి మింగుడుపడలేదు.
3.ఇక రాజకీయ విమర్శలు సరేసరి. ఒకప్పుడు “ఎవడి తెలుగు తల్లి, ఎక్కడి తెలుగు తల్లి” అంటూ చంద్రశేఖర రావు ప్రశ్నించిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి గులాబీ దళానికి కాస్త చెమటలు పట్టించే ప్రయత్నం చేసారు.
4. అయితే ఇంతవరకు మిగతావారు – అంటే రాజకీయ నాయకులు కానీ, పత్రికలు కానీ ఇతర మాధ్యమాలు కానీ ప్రస్తావించని ఒక విషయం – గిడుగు రామ్మూర్తి గురించి. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. తెలుగులో వాడుక భాషా ఉద్యమపితామహుడు,ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు, గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి లేకపోయి ఉంటే తెలుగు భాష ఇప్పటికీ సంస్కృత పదబంధాల్లో ఇరుక్కుపోయి పామరుడిని బెంబేలెత్తిస్తూనే ఉండేది. తెలుగు భాషకి సంబంధించిన ఒక మహాసభ, ప్రపంచ దేశాల నుంచి అతిథులని ఆహ్వానించిన సభ – తెలుగు భాషా దినోత్సవాన్ని ఎవరి జయంతిన జరుపుకుంటామో ఆయన పేరు ప్రస్తావించకపోవడం నిజమైన భాషాభిమానులని బాధించేదే. ఇందుకు కూడా ప్రాంతీయతే కారణమైతే అంత కంటే దుర్మార్గం మరొకటి ఉండదు.
అయితే ఏ వృక్షమూ లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షం అన్నట్టు తెలుగు గురించి ఈ మాత్రమైనా తెలంగాణా ప్రభుత్వం పట్టించుకుంది, ఎవరిని స్మరించినా ఎవరిని విస్మరించినా, సభలు జరిపింది, అదే పది వేలు అనే స్థాయికి తెలుగు వారు రావడం తెలుగు భాషాభిమనుల నిస్సహాయ స్థితికి దర్పణం పడుతోంది.