నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం.. కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. సీఎం కేసీఆర్ సహా… టీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ ఆ సభ ద్వారానే కరోనా సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన బహిరంగంగా పాల్గొన్న కార్యక్రమం హాలియాలో ఏర్పాటు చేసిన సభ మాత్రమే. దాని ద్వారానే కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్నారు. ఇలా అనుకోవడానికి బలమైన కారణం.. ఆ సభలో పాల్గొన్న వారిలో చాలా మందికి పాజిటివ్ వచ్చింది.
పోలింగ్ ముగిసిన తర్వాత ప్రచారంలో పాల్గొన్న పలు పార్టీల నాయకులు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కొంత మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే టిఆర్ఎస్ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్య లకి కూడా కరోనా సోకింది. వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలకూ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. పరిమితంగా ప్రచారం చేస్తున్నా కరోనా కేసులు మాత్రం వందల్లో నమోదవుతున్నాయి.
ఎన్నికల ప్రచారసభల్లో ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించరు. ఎన్నికల సంఘమూ పట్టించుకోదు. ప్రజలకు నీతులు చెప్పే రాజకీయ నేతలూ లైట్ తీసుకుంటారు. ఫలితంగా దేశంలో ఎన్నికల ప్రచారసభలు అలా జరిగిపోతున్నాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలోనూ ఎవరూ కరోనా నిబంధనలు పాటించలేదు. ఫలితంగా… కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.