తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తెరాస హావా ముందు మహా కూటమి ఏ స్థాయిలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న విశ్లేషణల్లో ప్రధానమైంది… తెలంగాణ ఫలితాల ప్రభావం ఆంధ్రాలో టీడీపీ ఉంటుందా..? ఓపక్క, టీడీపీతో కలిసి వెళ్లడం వల్లనే కాంగ్రెస్ కి కొన్ని స్థానాలు తెలంగాణలో తగ్గాయనే అభిప్రాయాలూ చర్చల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పరిస్థితి ఏంటనే చర్చకు తెర లేచినట్టయింది. తెలంగాణలో టీడీపీతో కలిసి వెళ్లకపోతే కొంత మెరుగైన ఫలితం తమకు వచ్చేదేమో అనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో అక్కడక్కడా వినిపిస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా కూడా, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అంత తీవ్రంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఉండకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఏపీ టీడీపీ వర్గాల్లో కూడా ఇప్పుడు కొంత వినిపిస్తోంది. దీంతో ఏపీలో ఈ రెండు పార్టీల కలయిక కొనసాగింపుపై కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల అంశానికి వచ్చేసరికి… కాంగ్రెస్, టీడీపీలు కలిసి పనిచేస్తాయా లేదా అనే చర్చ ఇంకా ఈ రెండు పార్టీల మధ్యా ప్రస్థావనకు రాలేదు. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్యా కొనసాగుతున్న చర్చలూ కార్యాచరణ ప్రణాళికలూ అజెండా కేవలం లోక్ సభ ఎన్నికలను దృష్టిలో మాత్రమే సాగుతున్నాయి. అయితే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల అంశమై టీడీపీలో కొంతమంది నేతల నిశ్చితాభిప్రాయం…. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు అనేది అస్సలు వద్దేవద్దు అనేది. ఇంకా, ఆ సందర్భం రాలేదు కాబట్టి, దానిపై చంద్రబాబు నాయుడు కూడా ఇంకా చర్చకు తేలేదని చెప్పుకోవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టత ఉన్నట్టు సమాచారం ఉంది. ‘రాష్ట్ర స్థాయిలో మీకు ఏది మంచిది అనిపిస్తే, ఆ విధంగా ముందుకు వెళ్లొచ్చ’నే భరోసా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి చంద్రబాబుకు ఉందని కూడా ఈ మధ్య వినిపించింది.
ఏదేమైనా, ఆంధ్రాలో కాంగ్రెస్ తో స్నేహం కొనసాగించాలా వద్దా..? ఇంకోపక్క, భాజపాయేతర పార్టీలను ఏకం చేసే క్రమంలో కాంగ్రెస్ తో కలిసి జాతీయ స్థాయిలో ఇప్పటికే చంద్రబాబు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి, జాతీయ స్థాయిలో ఫ్రెంట్ పెట్టుకుని… దాదాపు కన్వీనర్ స్థాయి బాధ్యతలు తీసుకుని, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ తో పోటీ కుదరదు అనడం సాధ్యమా..? వీటన్నింటికీ మించి… కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఏపీ ప్రజలు ఎలా చూస్తున్నారనేది అతి పెద్ద ప్రశ్న..? పోనీ, కనీసం తెలంగాణలో సెటిలర్ల ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజక వర్గాల్లోనైనా టీడీపీ కొంత ఊపు వచ్చి ఉంటే… దాన్ని కాంగ్రెస్ తో పొత్తుకు లభించిన ఆమోదంగా ఓరకంగా పరిగణించే అవకాశం ఉండేది. కానీ, అదీ లేకుండా పోయింది. ఇది తెరాస ప్రభంజనానికి వచ్చిన ఫలితమా, లేదా కాంగ్రెస్ తో పొత్తుకు ఆయా ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకతా… అనేది కూడా టీడీపీకి స్పష్టత రావాల్సి అంశం. మొత్తానికి, కాంగ్రెస్ తో పొత్తు అంశమై ఇప్పుడు ఏపీలో టీడీపీ ముందు చాలా ప్రశ్నలే కనిపిస్తున్నాయి.