శుక్రవారం విడుదలైన ‘బేబీ’ సినిమా చూస్తే ఓ విషయం అర్థమైంది. సెన్సార్ వ్యవస్థ పూర్తిగా నిద్రపోయిందని. ఎందుకంటే.. ఈ సినిమాలో బూతులు విచ్చల విడిగా వాడేశారు. అమ్మాయిల్ని అసభ్యంగా తిట్టే ఓ తిట్టు.. ఈ సినిమాలో చాలాసార్లు వినిపించింది. విచిత్రం ఏమిటంటే… ఒక్కో చోట బీప్ పడింది, ఒక్కో చోట అలా వదిలేశారు. ఒకే మాటని సెన్సార్ చేసి, దాన్నే ఎలా వదిలేశారో అర్థం కావడం లేదు. ఇదొక్కటే కాదు. చాలా పదాలు ఇలానే సెన్సార్ కత్తెర్లని దాటుకొని వచ్చేశాయి. ఇక లిప్ లాక్ సీన్ అయితే.. మరింత సుదీర్ఘంగా సాగింది. ఈ సీన్ కథకు ముఖ్యమైనది కాబట్టి.. దాన్ని సెన్సార్ వదిలేసిందే అనుకొందాం.
‘నువ్వు ఇప్పుడు తెరవాల్సింది కళ్లు కాదు.. కాళ్లు’ అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. దీని అర్థం విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి మాటలు కూడా సెన్సార్ ని దాటి వచ్చాయంటే ఏమనుకోవాలి. యూ.ఎస్కి వెళ్లిన ప్రింటులో అయితే బూతుల వర్షం కురిపించేశారు. ఓటీటీ, వెబ్ సిరీస్‌లో డైలాగులు కూడా తలవొంచుకొనేలా ఈ డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. యూ.ఎస్‌లో చూసేది కూడా తెలుగువాళ్లే కదా..? వాళ్లు బూతుల్ని లైట్ తీసుకొంటారన్న ధీమా దర్శక నిర్మాతలకు ఎలా వచ్చిందో? బేబీ అనే కాదు. ఈ మధ్య చాలా సినిమాల్లో బూతులు, అడల్ట్ సీన్లు విచ్చలవిడిగా బయటకు వచ్చేస్తున్నాయి. మరి సెన్సార్ ఏం చేస్తోందో, ఏంటో?