తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత బంగారి తెలంగాణా కోసం రేయింబవళ్ళు పనిచేస్తానని చెప్పుకొన్నారు. తను తెలంగాణా రాష్ట్రాన్ని ఏవిధంగా సాధించారో అదేవిధంగా తెలంగాణా రాష్ట్రాన్ని బంగారి తెలంగాణాగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పుకొన్నారు. అయితే అది తన స్వంత వ్యవహారం అన్నట్లుగా ప్రతిపక్షాలను, ప్రజలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు సాగుతుండటంతో, ఆయన ఆశయం చాలా గొప్పది…చాలా మంచిదే అయినప్పటికీ, ఎవరూ ఆయన మాటలను నమ్మడం లేదు. వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో తెరాస ప్రభుత్వ వైఫల్యాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఎండగట్టాయి.
చేతిలో అధికారంలో ఉన్నంత కాలం ఎవరూ ఎవరికీ సంజాయిషీలు చెప్పుకోవలసిన అవసరం ఉండకపోవచ్చును. కానీ ఎప్పుడయినా ఎన్నికలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితులు ఎదురవుతుంటాయి. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ పరిపాలనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం సర్వ సర్వసాధారణమయిన విషయమే. కానీ మావోయిస్టులు కూడా చాలా అసహనం వ్యక్తం చేయడం, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఖండించడం గమనార్హం.
తెరాసకు వ్యతిరేకంగా ఓటు వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి గుణపాఠం చెప్పాలని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ కోరారు. అంతటితో ఆగకుండా తెరాస పార్టీకి చెందిన సురేష్, రామకృష్ణ, మానె రామకృష్ణ, సత్యనారయణ, జనార్ధన్, పటేల్ వేంకటేశ్వరులు అనే ఆరుగురు నేతలను బుధవారం కిడ్నాప్ చేసారు. వారిని వదిలిపెట్టేందుకు వారు చేస్తున్న డిమాండ్స్ సంగతి పక్కనపెట్టి, అసలు ఈ పరిస్థితికి మూలకారణం ఏమిటి? అని ఆలోచిస్తే ఇటీవల జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదర్శిస్తున్న నియంతృత్వ పోకడలేనని చెప్పకతప్పదు. ఒకవేళ వరంగల్ ఉప ఎన్నికలలో తెరాస ఓడిపోయినట్లయితే, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి వైఖరి తెలంగాణా ప్రభుత్వంపై, రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఈవిధంగా విపరీత ప్రభావాన్ని చూపిస్తూ రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా ఉన్నట్లయితే దానిని సవరించుకొని ప్రజాభీష్టానికి అనుగుణంగా తనను మలుచుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రిదే. తెలంగాణా సాధన కోసం ఆయన ఏవిధంగా పట్టువిడుపులు ప్రదర్శించారో అదే విధంగా బంగారి తెలంగాణా సాధన కోసం నలుగురిని కలుపుకొని వెళ్ళే ప్రయత్నాలు చేయడం మంచిది.